ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి.. బాబు పక్కా ప్లాన్‌లో ఉన్నారుగా!

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 23న నిర్వహించనున్నారు. నామినేషన్ల సమర్పణకు ఈ నెల 13న చివరి తేదీగా ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. ఈక్రమంలో వైసీపీ అభ్యర్థులు గురువారం సీఎం జగన్‌ నుంచి బీ-ఫారం పత్రాలు పొంది నామినేషన్లను దాఖలు చేశారు. అయితే ఈ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి అన్న క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నుంచి కూడా ఓ అభ్యర్థిని బరిలో నిలిపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక్కో స్థానంలో అభ్యర్థి గెలవాలంటే 22 నుంచి 23 ఓట్లు అవసరం ఉంటుంది. కాగా.. ప్రస్తుతం టీడీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వారిలో నలుగురు పార్టీకి దూరంగా ఉంటున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి వైకాపాకు మద్దతుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆయా ఎమ్మెల్యేలపై విప్‌ జారీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో ఆయా ఎమ్మెల్యేలు అందరూ విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ వారు విప్‌ను ఉల్లంఘిస్తే ఆయా ఎమ్మెల్యేలపై టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు. ఇలా టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యేలపై చంద్రబాబు తన తెలివితేటలతో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోబోతున్నారు.

టీడీపీ నుంచి బరిలో ఎవరంటే..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు మాత్రమే ఓట్లు వేస్తారు. దీంతో ఒక సీటుకు పోటీ పడాలని, పార్టీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధను అభ్యర్థినిగా నిలపాలని టీడీపీ గురువారం నిర్ణయం తీసుకుంది. గతంలో విజయవాడ మేయర్‌గా పనిచేసిన ఆమె.. పార్టీ తరఫున బలంగా వాణిని వినిపిస్తారని పేరు తెచ్చుకున్నారు. ఆ పార్టీలో బీసీ వర్గాలకు చెందిన మహిళా నేతల్లో ఆమె చురుగ్గా వ్యవహరిస్తుంటారు. పార్టీ నిర్ణయంతో నామినేషన్‌ దాఖలుకు ఆమె సన్నద్ధమవుతున్నారని సమాచారం. ఈ ఎన్నికలో ఆమె గెలుపొందాలంటే.. ఇప్పుడు చేతిలో ఉన్నవిగాక తమకు మరొక ఓటు అవసరమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.