నేనూ నీకు సాయం చేయలేకపోయా: తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్
ఇటీవల గుండెపోటుతో మరణించిన సినీ నటుడు తారకరత్నను తలుచుకుంటూ.. ఆయన భార్య అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ చేసారు. తమ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకంటూ..మన అనుకున్నవారే తమను పట్టించుకోలేదని బాధపడ్డారు. “నువ్వు మాకు దూరమై నెల రోజులు కావొస్తోంది. కానీ జ్నాపకాలు ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి. మనం కలిసాం, బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం, డేటింగ్ చేసాం. మన రిలేషన్‌షిప్ గురించి నాకు అసలు నమ్మకం లేదు కానీ నువ్వు మాత్రం చాలా కాన్ఫిడెన్ట్‌గా నాతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నావు. ఆ నిర్ణయం తర్వాత నుంచే నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు. మనం పెళ్లి చేసుకున్నాక ఎన్నో గొడవలు అయ్యాయి. మనల్ని తక్కువచేసి చూసారు. అయినప్పటికీ ధైర్యంగా ముందుకెళ్లాం. ఈ ప్రయాణంలో నువ్వు నేను మాత్రమే ఉన్నాం. నిష్క పుట్టిన తర్వాత మన జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. మన సంతోషం రెట్టింపయ్యింది. కానీ బాధలు మాత్రం పోలేదు. మెల్లిగా ఒక్కోరోజు గడుస్తుండగా ద్వేషాన్ని మన దరిచేరనివ్వకూడదు అనుకున్నాం. 2019లో మనకు ఒక సర్‌ప్రైజ్ వచ్చింది. మనకి కవలలు పుట్టారు. నీకు పెద్ద కుటుంబం కావాలని కలలు కన్నావ్. నీకు ఎలాగో ఆ కల తీరకపోవడంతో మాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇవ్వాలనుకున్నావ్. ఇన్నేళ్లు నీ గుండెల్లో దాచుకున్న బాధ ఎవ్వరికీ కనిపించలేదు. మన అనుకున్నవారే మనల్ని బాధపెడితే అది చాలా నరకంగా ఉంటుంది. ఆ బాధ నుంచి నేను కూడా నిన్ను బయటికి తీసుకురాలేకపోయాను. మనతో మొదటినుంచి ఉన్నవారు చివరి వరకు ఉన్నారు. మనతో సంబంధాలు తెంచుకున్నవారు నిన్ను చివరిసారి కూడా చూడటానికి రాలేదు. నువ్వే మా రియల్ హీరో ఓబూ. నీతో ఉన్నది కొంతకాలమే అయినా నేను, మన పిల్లలు నీతో ఉన్న ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసాం. నీ పట్ల గర్వంగా ఉన్నాం. ఎక్కడైతే శాంతి, సంతోషాలు ఉంటాయో అక్కడ మళ్లీ మనం కలుసుకుంటాం అన్న ఆశతో జీవిస్తాను” అని ఎమోషనల్‌గా తన మనసులో మాటను బయటపెట్టారు అలేఖ్య. తారకరత్నను అలేఖ్య ఓబు అని పిలుస్తారు. ఆయన సొంత పేరు ఓబులేష్. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు తారకరత్న అని మార్చుకున్నారు