తమిళనాట ‘పెరుగు’ వివాదం
తమిళనాడు రాష్ట్రంలో పెరుగు పేరు మార్పు వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే కర్నాటక రాష్ట్రంలో కూడా పెరుగు పేరును హిందీలోకి మార్చినప్పటికీ అక్కడ ఎలాంటి గొడవలు జరగలేదు. కానీ తమిళనాడులో మాత్రం పెరుగు పేరు హిందీ భాషలోకి మార్చాలని ఆదేశాలు రావడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీజేపీ అధ్యక్షుడు, ఇతర పార్టీ నాయకులు, ప్రజలు మండిపడుతున్నారు.
అసలు వివాదం ఏంటంటే..
ఇప్పటికే హిందీ భాషను తమిళనాడు తిరస్కరిస్తున్న వేళ.. కొత్తగా పెరుగు పేరు మార్చడంపై మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) తమిళనాడు మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్‌కు ఇటీవల కొన్ని ఆర్డర్స్‌ని పాస్ చేసింది. అందులో ఎం చెప్పిందంటే.. ఇప్పటి వరకు పెరుగును ఇంగ్లీష్‌లో ‘కర్డ్’ అని, తమిళ్‌లో ‘తయిర్’ అని పిలుస్తుండగా.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెరుగు ప్యాకెట్లపై ‘దహీ’ అని హిందీలో స్పష్టంగా కనిపించేలా రాయాలని, కన్నడం, తమిళం భాషల్లో ఆ పదానికి సమాన అర్థాన్ని బ్రాకెట్లలో రాయాలని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ ఉత్తర్వుల్లో పేర్కొంది. పెరుగుతోపాటు నెయ్యి, చీజ్ పేర్లను కూడా హిందీ భాషలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేయడం మరింత వివాదాస్పదమైంది. దీంతో తమిళనాడు పాల ఉత్పత్తిదారులు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఈ విషయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. హిందీ భాషను తమిళనాడులో బలవంతంగా కేంద్ర ప్రభుత్వం రుద్దాలని చూస్తోందని సీఎం స్టాలిన్ పరోక్షంగా విమర్శలు చేశారు. ఎంకే స్టాలిన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, ప్రజల మనోభావాలను గౌరవించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐని డిమాండ్ చేశారు. తమ మాతృభాషలను దూరం చేసుకోవాలని రాష్ట్రాలను కోరవద్దని హితవు పలికారు. పిల్లలను గిల్లి, ఊయల ఊపడం వంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. పెత్తనం చేయాలని చూడవద్దని చెప్పారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే ఊయల ఊపడానికి ముందే మీరు కనుమరుగైపోతారని స్పష్టం చేశారు.
తమిళనాడులో తీవ్ర దుమారం రేపుతున్న ఈ ఇష్యూపై ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పందించింది. హిందీ భాషతోపాటు, ఇంగ్లీష్, స్థానిక భాషల్లో కూడా పెరుగు ప్యాకెట్లపై పేర్లను బ్రాకెట్లలో రాసుకోవచ్చని సూచించింది. దీంతో ఆ సంస్థ ఇచ్చిన ఆదేశాలను సవరించుకుంది.