ఇన్​స్టాలోకి విజయ్​.. రికార్డుల మోత!

తమిళ టాప్​ హీరోల్లో ఒకరు ఇళయ దళపతి విజయ్​. కోలీవుడ్​లోనే కాదు తెలుగులోనూ విజయ్​కి ఫ్యాన్​ ఫాలోయింగ్​ బాగానే ఉంది. అందుకే విజయ్​ సినిమాలు తెలుగులోనూ రిలీజ్​ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. విజయ్​ సినిమాలైన తుపాకీ, విజిల్​, సర్కార్​ తెలుగులోనూ మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇక, ఇటీవలే విజయ్​ తెలుగు దర్శకుడైన వంశీ పైడిపల్లి సినిమా వారసుడుతో నేరుగా టాలీవుడ్​ సినిమా చేసి అలరించారు. తమిళంలో వారిసు టైటిల్​తో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం విజయ్​ తన తదుపరి సినిమా అయిన లియో షూటింగ్​తో బిజీగా ఉన్నారు. కాగా, ఈ సందర్భంగా విజయ్​ తన అభిమానులకు ఓ సర్​ఫ్రైజ్​ ఇచ్చారు. తాజాగా విజయ్​ ప్రముఖ సోషల్​ మీడియా ఫ్లాట్​ఫామ్​ అయిన ఇన్​స్టాగ్రామ్​లోకి ఎంట్రీ ఇచ్చి ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న అభిమానుల కలను నిజం చేశారు.

కోలీవుడ్​ స్టార్​ హీరో విజయ్​ ఎట్టకేలకు ఇన్​స్టాగ్రామ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళులు ఇళయ దళపతిగా అభిమానించే విజయ్​ ఎప్పుడెప్పుడు ఇన్​స్టాలో అడుగు పెడతారా.. అని వేచి చూశారు అభిమానులు. ఇన్నాళ్లకు అభిమానుల ఆశ తీరిపోయింది. విజయ్​కి తమిళనాడులో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. విజయ్ సినిమా రిలీజయితే అభిమానులకు పండగే. మొదటి రోజు థియేటర్స్ అభిమానుల మోతతో దద్దరిల్లాల్సిందే. ఇక విజయ్ సినిమాకు సంబంధించిన విషయాలు, పుట్టిన రోజు వంటి విషయం బయటకు వచ్చినా అభిమానులు భారీగా సంబరాలు జరుపుకుంటారు.

ఇక, ఇన్​స్టాగ్రామ్​లో ఎంట్రీ ఇచ్చిన విజయ్​ actorvijay హ్యాండిల్​తో అకౌంట్ ఓపెన్ చేసి, మొదటగా లియో సినిమా సెట్స్ లో దిగిన ఫోటోని షేర్ చేశారు విజయ్. అలాగే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఓ ఫోటోని పోస్ట్ చేశారు. లియో షూట్ సమయంలో కాశ్మీర్​ మంచులో దిగిన ఫొటోని పోస్ట్ చేశారు విజయ్. అంతేకాదు ‘నా స్నేహితులందరికీ హలో..’ అని తమిళంలో రాసుకొచ్చారు. ఇక విజయ్ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశాడని తెలియడంతో అభిమానులు, ప్రేక్షకులు, నెటిజన్లు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విజయ్ ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. దీంతో అకౌంట్​ ఓపెన్​ చేసిన మొదటి రోజే విజయ్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

విజయ్ కేవలం గంటన్నరలోనే 1 మిలియన్ ఫాలోవర్స్ మార్క్​ అందుకున్నారు. మూడు గంటల్లో 2 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారు. ఇక హాఫ్ డేలో 3.7 మిలియన్స్ ఫాలోవర్స్ విజయ్ ని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. దీంతో చాలా తక్కువ టైంలో ఇంతమంది ఫాలోవర్స్ వచ్చిన స్టార్ గా ఇండియాలో సరికొత్త రికార్డ్ సృష్టించారు విజయ్​. అంతే కాకుండా అతి తక్కువ టైంలో 1 మిలియన్ ఫాలోవర్స్ సాధించిన అకౌంట్ గా ప్రపంచంలో మూడో స్థానంలో, ఇండియాలో మొదటి స్థానంలో నిలిచాడు విజయ్. ఇప్పటివరకు ప్రపంచంలో తక్కువ సమయంలో ఒక మిలియన్​ ఫాలోవర్స్​ని అందుకున్న వారిలో మొదటి స్థానంలో BTS V, రెండో స్థానంలో ఏంజెలినా జోలీ ఉన్నారు.

కేవలం ఫాలోవర్స్ లోనే కాకుండా లైక్స్ లో కూడా సరికొత్త రికార్డ్స్ సృష్టించారు విజయ్. మొదట పోస్ట్ చేసిన ఫొటోకి కేవలం 20 నిమిషాల్లోనే 100k లైక్స్ సాధించి కోలీవుడ్ స్టార్స్ లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన హీరోగా రికార్డ్ సృష్టించారు. అలాగే ఇప్పటికే ఈ ఫోటో 38 లక్షలకు పైగా లైక్స్ సాధించి అత్యధిక లైక్స్ సాధించిన మొదటి కోలీవుడ్ స్టార్ పోస్ట్​గానూ రికార్డు క్రియేట్​ చేసింది. ఎంట్రీలోనే అదరగొడుతున్న విజయ్​ ఫాలోయింగ్​ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ‘అదీ ఇళయ దళపతి అంటే..’ అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.