Sumit Nagal: అడిగినంత‌ డ‌బ్బిస్తేనే ఇండియా త‌ర‌ఫున ఆడ‌తా

Sumit Nagal demands money

Sumit Nagal: భార‌త‌దేశం త‌ర‌ఫున క్రీడ‌ల్లో పాల్గొనే అవ‌కాశం, ఆ ప్రోత్సాహం ల‌భిస్తేనే క్రీడాకారులు ఎంతో సంతోషిస్తారు. అలాంటిది భార‌త్ టెన్నిస్ ప్లేయ‌ర్ అయిన సుమిత్ న‌గ‌ల్ అడిగినంత డ‌బ్బు ఇస్తేనే భార‌త్ త‌ర‌ఫున ఆడ‌తాను అన‌డం క్రీడా రంగంలో సంచ‌ల‌నంగా మారింది. డావిస్ క‌ప్‌లో ఆడేందుకు సుమిత్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేష‌న్‌ను ఏకంగా 50 వేల డాల‌ర్లు అడిగాడ‌ట‌. ఆ డ‌బ్బు ఇస్తేనే డావిస్ క‌ప్‌లో ఆడ‌తాన‌ని అన్న‌ట్లు అసోసియేష‌న్ వెల్ల‌డించింది. దేశం త‌ర‌ఫు ఆడేందుకు ఒక క్రీడాకారుడికి అద‌నంగా ఎందుకు డ‌బ్బు ఇవ్వాల‌ని ప్ర‌శ్నించింది. అంత‌ర్జాతీయ టెన్నిస్ ఫెడ‌రేష‌న్ నుంచి ప్ర‌భుత్వ ఫండ్స్ నుంచి కోట్ల‌ల్లో డ‌బ్బులు వ‌స్తాయ‌ని.. ఇవి చాల‌వ‌న్న‌ట్లు ఇండియ‌న్ అసోసియేష‌న్ నుంచి అద‌నంగా డ‌బ్బు అడ‌గ‌డం సిగ్గుచేట‌ని మండిప‌డింది.

దీనిపై సుమిత్ స్పందిస్తూ.. తాను అడిగిన దాంట్లో త‌ప్పేముంద‌ని.. ఇది ఎక్క‌డైనా ఉండే స్టాండ‌ర్డ్ రూల్ అని అన్నారు. టెన్నిస్ అసోసియేష‌న్‌తో తాను చ‌ర్చించిన అంశాల‌న్నీ గోప్యంగా ఉంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. తాను డావిస్ క‌ప్‌లో గాయం వ‌ల్ల ఆడటం లేద‌ని తెలిపారు. తాను పూర్తిగా కోలుకున్నాక భ‌విష్యత్తులో జరిగే అన్ని టోర్నమెంట్ల‌లో భార‌త్ నుంచి గ‌ర్వంగా పాల్గొంటాన‌ని వెల్ల‌డించారు.