సంక్షేమం, అభివృద్దితో ఏపీ ముందుకు వెళ్తోంది -గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్రంలో అమలువుతున్న సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాల పథకాలతో పేదలకు ఎంతో మేలు జరుగుతోందని గవర్నర్‌ తెలిపారు. డీబీటీ ద్వారా అవినీతి లేకుండా లబ్దిదారులకు నేరుగా సొమ్ము చేరుతోందని… సచివాలయ వ్యవస్థతో ప్రజల దగ్గరకే పాలన అందిస్తున్నట్లు ఆయన వివరించారు. కేవలం 45 నెలల్లో 1.97 లక్షల కోట్ల నగదు ప్రజలకి నేరుగా వివిధ సంక్షేమ పథకాల రూపంలో చేరిందన్నారు. అసలేన లబ్దిదారుల గుర్తింపు కోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో రాష్ట్రం ముందుకు వెళ్తోందని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు. అదేవిధంగా ప్రధానంగా ప్రభుత్వ బడులు నాడు-నేడు పథకంతో ఆధునికీకరించబడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమానికి తొలి విడతలో రూ.3669 కోట్లతో 15,717.. రెండో విడతలో రూ. 8,345 కోట్లతో 22,345 స్కూళ్ల రూపురేఖలు మారాయన్నారు. అమ్మఒడి కింద రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది తల్లులకు రూ.15వేలు చొప్పున రూ. 9900కోట్లు లబ్ది చేకూరినట్లు గవర్నర్‌ వివరించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం సీఎం పాలన కొనసాగుతోందని ఆయన తెలిపారు. సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు.

స్పీకర్ నేతృత్వంలో బీఏసీ సమావేశం..
ఉభయ సభల్లో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం.. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరగనుంది. దీనిలో సభ ఎలాంటి బిల్లు పెడుతున్నారు.. సభ ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలపై చర్చించాలి, రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీని నిర్ణయించనున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కనీసం 7, 8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మంగళవారం జరిగే.. బీఏసీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్ ఆమోదించనుంది.

ఈ నెల 17న ఏపీ బడ్జెట్ ప్రకటన..
అసెంబ్లీలో 2023-24 ఏడాదికి సంబంధించి ఈ నెల 17న రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ వరకు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఏడాది రూ. 2 లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమంతోపాటు వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో ఎన్నికల ఉండటంతో ఇదే పూర్తి స్థాయి చివరి బడ్జెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం అన్ని అంశాలపై దృష్టి సారించింది. మరోవైపు పలు కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. ప్రధానంగా నాలుగేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన అభివృద్ధితోపాటు, మూడు రాజధానుల అంశం, సంక్షేమం కార్యక్రమాల అమలు, వైజాగ్ గ్లోబల్ ఇన్వెష్టర్స్‌ సమ్మిట్‌ తదితర అంశాల ఎజెండాలపై అసెంబ్లీలో కీలక చర్చలు జరగనున్నాయి.