పాపం.. సూర్య అనుకుని చాట్ చేస్తున్న డ్రైవ‌ర్!

మ‌నిషిని పోలిన మ‌నుషులు ఏడుగురు ఉంటార‌ని పెద్ద‌లు అంటుంటారు. ఇప్ప‌టికే ఎందరో సెల‌బ్రిటీలను పోలిన వారు టిక్‌టాక్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఫేమ‌స్ అయిపోతున్నారు. అయితే ఓ క్యాబ్ డ్రైవ‌ర్ మాత్రం.. త‌న క్యాబ్ ఎక్క‌డానికి వ‌చ్చిన వ్య‌క్తి అచ్చం ప్ర‌ముఖ న‌టుడు సూర్య‌లా ఉన్నాడ‌నుకుని పొర‌బ‌డ్డాడు.  ఆటోగ్రాఫ్‌తో పాటు వాట్సాప్ నెంబ‌ర్ కూడా తీసుకున్నాడ‌ట‌. అంతేకాదు.. సూర్య‌తో చాట్ చేస్తున్నా అనుకుని అప్పుడ‌ప్పుడు అత‌నికి మెసేజ్‌లు కూడా పెడుతున్నాడ‌ట‌. ఈ విషయాన్ని ప్ర‌ముఖ తెలుగు స్టాండ‌ప్ క‌మెడియ‌న్ రాజ‌శేఖ‌ర్ మామిడ‌న్న ఓ షో సంద‌ర్భంలో చెప్పారు.

రాజ‌శేఖ‌ర్‌కు శ్రీలంక రాజ‌ధాని కొలంబోలో షో చేసే అవ‌కాశం వ‌స్తే వెళ్లార‌ట‌. ఆ స‌మ‌యంలో ఓ క్యాబ్ మాట్లాడుకున్నార‌ట‌. అప్పుడు క్యాబ్ డ్రైవ‌ర్ ఇలా అన్నాడ‌ట‌. “స‌ర్ మీరు ఇండియా నుంచి వ‌చ్చారా? నేను సౌత్ ఇండియ‌న్ స్టార్‌ను క‌లిసాను. ఆయ‌న గ‌జిని సినిమాలో హీరో సూర్య‌. ఆయ‌న నాకు తన వాట్సాప్ నెంబ‌ర్ కూడా ఇచ్చారు. అప్పుడ‌ప్పుడు నేను స‌ర్‌కి మెసేజ్‌లు కూడా పంపుతుంటాను. సూర్య స‌ర్ నాకు టిప్ కూడా ఇచ్చారు” అని చెప్తూ తెగ సంబ‌ర‌ప‌డిపోయాడ‌ట‌. దాంతో రాజ‌శేఖ‌ర్ థ్రిల్‌గా ఫీల‌య్యార‌ట‌. సూర్య కూర్చున్న సీట్లో తాను కూర్చున్నాన‌ని తెగ ఆనంద‌ప‌డ్డార‌ట‌. కాక‌పోతే వాట్సాప్ నెంబ‌ర్ కూడా ఇచ్చార‌ని తెలిసి కాస్త షాక‌య్యాడు. ఆ అనుమానంతో “నాకు ఒక‌సారి వాట్సాప్ చాట్ చూపించ‌రా” అని క్యాబ్ డ్రైవ‌ర్‌ను అడిగార‌ట‌. అలా రాజ‌శేఖ‌ర్ వాట్సాప్ డీపీ చూడ‌గానే అత‌ను సూర్య కాదు సూర్య‌లాగే ఉన్న ఓ కామ‌న్ మ్యాన్ అని తెలిసి షాక‌య్యాడు. అయితే సూర్య‌నే త‌న క్యాబ్ ఎక్కారు అనుకుని ఆనంద‌ప‌డుతున్న క్యాబ్ డ్రైవ‌ర్‌కు అస‌లు విష‌యం చెప్పి బాధ‌పెట్ట‌డం ఎందుకు అని ఏమీ చెప్ప‌కుండా సైలెంట్‌గా ఉండిపోయారట‌.