య‌శ్ గురించి త‌ప్పుడు ప్ర‌చారం.. ఇచ్చిప‌డేసిన KGF భామ‌

రాకింగ్ స్టార్ య‌శ్ గురించి ఓ వ్య‌క్తి చేసిన త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌పై క‌న్న‌డ న‌టి శ్రీనిధి శెట్టి క్లారిటీ ఇచ్చారు. త‌న‌ని తాను ఫిలిం క్రిటిక్ అని చెప్పుకుంటూ సోష‌ల్ మీడియాలో ముందు వెన‌క ఆలోచించ‌కుండా లేని పోని ట్వీట్లు చేస్తుంటాడు ఉమైర్ సంధు. అస‌లు ఇత‌ను ఎవ‌రు, ఎక్క‌డి నుంచి ప‌నిచేస్తున్నాడు తెలీదు కానీ త‌న‌ని తాను గొప్ప ఫిలిం క్రిటిక్‌లా, సెన్సార్ బోర్డు స‌భ్యుడిన‌ని చెప్పుకుంటూ ఉంటాడు. సినిమాలు రిలీజ్ కాకుండానే ప్రీమియ‌ర్ షోలు చూసేసాన‌ని, అంత రేటింగ్ ఇవ్వ‌చ్చు ఇంత రేటింగ్ ఇవ్వ‌చ్చు అని ఇష్ట‌మొచ్చిన‌ట్లు కామెంట్లు పెట్టేస్తుంటాడు.

ఇప్పుడు అత‌ని వ‌ల్ల శ్రీనిధి శెట్టి సోష‌ల్ మీడియాలో క్లారిటీ ఇవ్వాల్సి వ‌చ్చింది. శ్రీనిధి.. య‌శ్‌తో క‌లిసి క‌న్న‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా కేజీఎఫ్‌, కేజీఎఫ్‌2లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే య‌శ్ ఒక టాక్సిక్ వ్య‌క్తి అని, తోటివారిని హింసిస్తుంటాడ‌ని ఇంకెప్పుడూ జీవితంలో అత‌నితో క‌లిసి న‌టించ‌ను అని శ్రీనిధి చెప్పిన‌ట్లు ఉమైర్ ట్వీట్ పెట్టాడు. దాంతో చాలా మంది ఫ్యాన్స్ శ్రీనిధిని, య‌శ్‌ను ట్యాగ్ చేస్తూ ఇది నిజ‌మేనా అని అడుగుతున్నారు. ఇలాంటివాళ్ల‌కు వెంట‌నే బుద్ధి చెప్పాల‌న్న ఉద్దేశంతో శ్రీనిధి ట్విట‌ర్ వేదిక‌గా క్లారిటీ ఇచ్చారు.

“ఏ మాధ్య‌మం అయినా.. అది వాడే మ‌నిషిని బ‌ట్టి ఉంటుంది. కొంద‌రు సోష‌ల్ మీడియా అనే మాధ్య‌మాన్ని త‌ప్పుగా వాడుతూ.. ఇత‌రుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయాల‌ని త‌ప్పుడు విష‌యాలు ప్ర‌చురించి కించ‌ప‌ర‌చాల‌ని చూస్తుంటారు. కానీ నేను మాత్రం ప్రేమ‌ను పంచ‌డానికి, నా జీవితంలో ముఖ్య‌మైన వారిని అభినందించ‌డానికి వాడుతుంటాను. మాటిమాటికీ ఒకే మాట చెప్తున్నాను అని అనుకోక‌పోతే.. మళ్లీ చెప్తున్నాను. కేజీఎఫ్ ప్ర‌పంచాన్ని సృష్టించిన‌ప్పుడు మ‌న రాకింగ్ స్టార్ య‌శ్‌తో క‌లిసి న‌టించడం చాలా గొప్ప‌గా అనిపించింది. అత‌ను నిజ‌మైన జెంటిల్‌మెన్‌, నాకు మెంటార్, స్నేహితుడు, స్ఫూర్తినింపే వ్య‌క్తి. రాకింగ్ స్టార్ య‌శ్.. నేను ఎప్పుడూ మీకు అభిమానినే” అని పేర్కొన్నారు.