అత్తింటి ముందు అల్లుడి ధర్నా.. కారణం ఏంటంటే?

అత్తింటి ముందు అల్లుడు ధర్నా చేసిన సంఘటన తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా కోదాడలో చోటుచేసుకుంది. తన మూడేళ్ల కుమారుడిని చూపించాలని అల్లుడు కోరుతుండగా.. అత్తింటి వారు పట్టించుకోవట్లేదని అతను వాపోతున్నారు. అందుకే ఇంటి ముందు కూర్చుని ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ కోదాడకు చెందిన రమణితో 2018లో పెళ్లి జరిగింది. ఆపై మూడేళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి ఓ కొడుకు కూడా పుట్టాడు. ఈక్రమంలో 2021లో భార్యాభర్తల మధ్య విభేదాలు తలేత్తాయి. దీంతో రమణి పృథ్వి కొడుకును తీసుకుని కోదాడలోని పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత కొడుకును తల్లిదండ్రుల వద్ద వదిలేసి ఆమె కెనడా వెళ్లిపోయింది. దీంతో ప్రవీణ్ కుమార్ కూకట్ పల్లిలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వారానికి ఒకసారి అయినా తండ్రీ కొడుకులను కలుసుకునేందుకు వీలు కల్పించాలంటూ ప్రవీణ్‌ అత్తకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఏడాదిన్నరగా తన కొడుకును కలవనివ్వడంలేదని, కోర్టు తీర్పును కూడా అమలుచేయట్లేదని ప్రవీణ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన కొడుకును దూరం చెయ్యవద్దూ అంటూ.. ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈక్రమంలో అత్త ఇంటి ముందు ప్రవీణ్‌.. తన తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగాడు. కొడుకు కోసం కొన్న ఆట వస్తువులను ప్రదర్శిస్తూ అత్తామామల తీరుపై నిరసన వ్యక్తం చేశాడు.