వివేకా హత్యలో ఇన్ని ట్విస్టులా.. ఇదేం కేసు బాబోయ్!
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు తుది దశకు చేరుకున్న తరుణంలో అనేక మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ అధికారులు, వివేకా కుటుంబంపై అనేక ఆరోపణలు చేశారు. దీంతో ఈ కేసులో పలు కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తనను సీబీఐ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందని.. తన ప్రతిష్టను భంగం కలిగించే అలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. అవినాష్ తరపు లాయర్.. సీబీఐ విచారణ తీరుపై పలు సందేహాలను లేవనెత్తుతూ కోర్టు దృష్టికి వాటిని తీసుకొచ్చారు. వివేకా హత్యకు కుటుంబ కలహాలు కారణమని, ప్రధానంగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు కలిసి హత్యకు కుట్రపన్ని ఉండవచ్చని కోర్టుకు వివరించారు. వారిని కూడా సీబీఐ మరోసారి విచారించాలని కోరారు. మరోవైపు వివేకా ముస్లిం మహిళను రెండో పెళ్లి చేసుకున్నారని, వారికి ఓ కుమారుడు కూడా ఉన్నారని.. అతన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఉద్దేశం ఉండటంతో వివేకా హత్యగావించబడ్డారని అవినాష్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్‌ను సీబీఐ విచారిస్తున్న తీరుపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
కోర్టు ఏమందంటే..
సీబీఐ విచారణ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి వివేకా హత్యకు సంబంధించి చెప్పిన విషయాలను ఎప్పటి కప్పుడు నమోదు చేసినట్లు కోర్టుకు సీబీఐ అధికారి రాంసింగ్ తెలిపారు. వాటికి సంబంధించి పలు ఆడియోలు, వీడియోలను హార్డ్ డిస్క్ లో కోర్ట్ ముందు సీబీఐ అధికారులు ఉంచారు. దాదాపు 10 డాక్యుమెంట్లు, 35 సాక్షుల వాంగ్మూలాలు, కొన్ని ఫోటోలను కోర్టుకు సమర్పించారు. హత్య సమయంలో సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని తాము భావిస్తున్నట్లు సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే ప్రస్తుతానికి అవినాష్‌ను తాము ఓ సాక్షిగా పరిగణిస్తున్నామని తెలిపారు. సీబీఐ వాదనలు విన్న కోర్టు.. ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి తీర్పు వెల్లడించేవరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది.
సునీత రెడ్డి పిటిషన్‌లో సంచలన విషయాలు..
వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి హైకోర్టులో మరో ఇంప్లిడ్ పిటిషన్‌న్ దాఖలు చేశారు. అవినాష్ రెడ్డి కోర్టులో తన ప్రస్తావన తీసుకురావడంతో తన తరపున పిటిషన్ వేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఇక దీనిలో పలు సంచలన అంశాలను ప్రస్తావించారని సమాచారం. ఎంపీ అవినాశ్‌రెడ్డి ప్రోద్బలంతోనే దస్తగిరితోపాటు మిగిలిన నిందితులకు డబ్బులు చేరాయని తెలిపారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను కావాలనే ఓడించారని, 2019లో వివేకాకు ఎంపీ టికెట్ ఇస్తున్నారనే హత్య చేశారని ఆమె తెలిపారు. వివేకా ఇంటికి వచ్చిన శశికళకి గుండెపోటుతో చనిపోయినట్లు అవినాశ్ చెప్పాడని సునీత ఆరోపించారు. హత్య కాదు.. సాధారణ మరణం అని చిత్రీకరించే ప్రయత్నం చేశారని.. వివేకాను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంటే 10 కోట్లు ఇస్తానని అవినాశ్ చెప్పినట్లు గంగాధర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడని సునీత అన్నారు. విచారణకు సహకరించకుండా కోర్టుల్లో అవినాశ్ తప్పుడు కేసులు వేస్తున్నాడు. తనపై, తన కుటుంబంపై, దర్యాప్తు అధికారులపై అవినాశ్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. దాదాపు వివేకా హత్య జరిగి నాలుగేళ్లు అవుతోంది. ఇప్పటికే ఈ కేసు కొలిక్కి రాలేదు. పైగా ట్విస్టుల నడుమ కొనసాగుతోంది. అసలు ఈ కేసులో దోషులు ఎవరు అని తెలుస్తుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఏపీ ప్రజల్లో నెలకొంది.