“సుశాంత్ బతకాలని లేదు అంటుండేవాడు”
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2020 జూన్ 14న సుశాంత్.. తన అపార్ట్మెంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పటికే బాలీవుడ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని స్టార్‌గా ఎదుగుతున్న సుశాంత్ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుని చిన్నవయసులోనే వెళ్లిపోవడంతో అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై ఇప్పటికీ సీబీఐ విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మంత్రి స్మ్రతి ఇరానీ.. సుశాంత్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు.
“సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రోజు నేను ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నాను. ఆ కాన్ఫరెన్స్‌లో చాలా మంది పాల్గొన్నారు. కానీ నేను అవేవీ పట్టించుకోలేదు. అతని మరణ వార్త తెలిసి కాన్ఫరెన్స్ ఆపేయండి అని చెప్పాను. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు సుశాంత్ నాకు ఎందుకు కాల్ చేయలేదు అని ఎంతో బాధపడ్డాను. నాకు ఒక్క కాల్ చేసి ఉంటే ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పి ఉండేదాన్ని. వెంటనే నేను నటుడు అమిత్ సాధ్‌కు ఫోన్ చేసాను. ఎందుకంటే అమిత్, సుశాంత్ కలిసి కై పో చే సినిమాలో నటించారు. కాబట్టి అతనితో ఏమైనా చెప్పాడేమోనని అతనికి కాల్ చేసా. సుశాంత్ ఎప్పుడూ నాకు అసలు బతకాలని లేదు అంటుండేవాడు. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడని అనుకుంటూ ఉండేదాన్ని” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.