భద్రాద్రి రాముని కల్యాణం.. కమనీయం

తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణోత్సవం భక్తుల రామనామస్మరణతో మిథులా స్టేడియం వైభవంగా రుత్వికులు నిర్వహించారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు కల్యాణోత్సవం ప్రారంభం కాగా.. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యలకు జీలకర్ర బెల్లం పెట్టారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జరిపించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ వేడుకను మిథులా స్టేడియంలో ప్రత్యేకంగా నిర్వించిన మండపంలో ఈ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. తొలుత సీతారాములు ఉత్సవ విగ్రహాలను మండపానికి ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అనంతరం ముహూర్తం సమయానికి సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా అర్చకులు సంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు.

ఈ ఏడాది ప్రత్యేకతలు ఇవే..
ఈ వేడుకల్లో భాగంగా స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. సీతారాముల కళ్యాణోత్సవం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో సాగింది. ప్రతీ ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు జరిగాయి. మిథులా స్టేడియానికి సువర్ణ ద్వాదశ వాహనాలపై స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా వచ్చారు. కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్ దీపాలతో కళకళలాడుతోంది. భక్తులు ఎక్కడా అసౌకర్యానికి గురికాకుండా.. మిథిలా స్టేడియంలో 2.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పందిళ్లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఎక్కడికక్కడ అమర్చారు. దీంతో పాటు లడ్డూ కౌంటర్లు 19, తలంబ్రాల పంపిణీ కోసం 70 కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం రెండు లక్షల లడ్డూలను దేవస్థానం అధికారులు పంపిణీ చేపట్టారు.