నేను స్లిమ్‌గా అయ్యానంటే తనే కారణం – నారా లోకేష్
యువగళం పేరుతో చంద్రబాబు తనయుడు.. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టిన విషయం విదితమే. ఇక ఈ యాత్రలో భాగంగా తిరుపతిలో శుక్రవారం హెలో లోకేష్ పేరుతో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు, యువత కొన్ని ప్రశ్నలు రాసి లోకేష్ నుంచి సమాధానాలు రాబట్టారు. అందులో కొన్ని రాజకీయాలకు, మరికొన్ని వ్యక్తిగత ప్రశ్నలు కూడా రాశారు. ”మీరు స్లిమ్‌గా అవ్వడానికి కారణం ఎవరు” అని లోకేష్‌ను ఒకరు అడిగారు. దీనిపై స్పందించిన ఆయన.. కోవిడ్ సమయంలో రెండేళ్లు ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చిందని ఆ సమయంలో తన భార్య బ్రాహ్మణి కోరిక మేరకు వర్కవుట్లు చేసి బరువు తగ్గానని తెలిపారు. ఏ రోజు ఏం తినాలి అనే విషయాలతోపాటు తినేటప్పుడు దగ్గరే ఉండి బ్రాహ్మణి పరిశీలించేదని లోకేష్ చెప్పారు. తిండి విషయంలో తన భార్య చాలా జాగ్రత్తలు చెప్పేదని వివరించారు.
పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..
జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడాన్ని మీరు ఆహ్వానిస్తారా అని ఒకరు లోకేష్‌ను ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన ఆయన.. ప్రజలకు మంచి చేయాలని, అభివృద్ధి ఫలాలు దక్కాలని మంచి మనసుతో కోరుకునే ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావచ్చని లోకేష్ అన్నారు. పవన్ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని.. ఆయన 2014లో తమ పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు ఓసారి కలవడం జరిగిందన్నారు. అప్పుడే ఆయన మంచితనం తెలిసిందన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలుపునిచ్చారు.
లోకేష్ పై వైసీపీ నేతలు ఫైర్..
తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్‌పై లోకేష్ చేసిన కామెంట్లపై వైసీపీ నేత, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కేవలం వ్యక్తులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే వాళ్లని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే జూనియర్ ఎన్టీఆర్ ను తండ్రీకొడుకులు అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి చంద్రబాబు వచ్చారని ఈ విషయం అందరికీ తెలుసుని అన్నారు. ఒకవేళ టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు కట్టబెడితే ఆ పార్టీకి మనుగడ ఉంటుందని నాని జోస్యం చెప్పారు.