Orange సీక్వెల్.. రిస్క్ చేస్తున్నారా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన మూడో సినిమా ఆరెంజ్. 2010లో వచ్చిన ఈ సినిమా చెర్రీ కెరీర్నే అయోమయంలో పడేలా చేసింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వలో వచ్చిన ‘మగధీర’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వచ్చిన ‘ఆరెంజ్’ ఫలితం మెగా అభిమానులను కలవర పెట్టింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ అందుకుంది. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ ఒక సరికొత్త లవ్ స్టోరీ ని ఈ సినిమాతో ఆవిష్కరించాలని అనుకున్నారు కానీ ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. దాంతో ఈ సినిమా నిర్మించిన మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర నష్టాలకు గురయ్యారు.
సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ ఒక వర్గం ప్రేక్షకులకి ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ జనరేషన్ యూత్ “ఆరెంజ్” సినిమాని ఒక కల్ట్ క్లాసిక్ గా మెచ్చుకుంటారు. ఇక, ఈ సినిమాలోని పాటలైతే అప్పట్లో సంచలనమే. ఎక్కడ చూసినా ఈ సినిమా లవ్బీట్స్ వినపడేవి. ఈ నేపథ్యంలోనే మార్చ్ 27న మార్చ్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేశారు. మూడు రోజులపాటు థియేటర్ లలో ఆడిన ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లు అందుకొని రికార్డులు సృష్టించింది. ఈ సినిమా ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అవడంతో సినిమాకి సీక్వెల్ ఉంటే బాగుంటుందని చర్చలు మొదలయ్యాయట.
అప్పట్లో రామ్ చరణ్ కాకుండా వేరే హీరో ఎవరైనా చేసి ఉంటే సినిమా హిట్ అయ్యేది అని కొందరు భావించారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. హాలీవుడ్ లెవల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ ఒక ప్రేమ కథ చిత్రం చేయటం కాస్త రిస్కే అవుతుందంటున్నారు సినీ విశ్లేషకులు. మాస్ హీరో ఇమేజ్ కూడా వచ్చేసిన తర్వాత లవ్ స్టోరీలు చేస్తే ప్రేక్షకులు అంతగా ఆదరించే అవకాశాలు తక్కువ. ‘రాధే శ్యామ్’ విషయంలోనే ప్రభాస్ ఘోరంగా విఫలమై ఈతరం హీరోలకు ఒక ఉదాహరణగా మిగిలారు. అయితే ‘ఆరెంజ్’ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తే అది రామ్ చరణ్ తోనే ప్లాన్ చేస్తారా లేక మరే హీరోతో రూపొందిస్తారో తెలియాలంటే అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే!