GIS 2023: పెట్టుబడులతో రాష్ట్రం మరింత ముందుకు

విశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ లో మార్చి 4వ తేదీ అనగా రెండో రోజు శనివారం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏయూ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన పలు నూతన పారిశ్రామిక యూనిట్లను ఆయన ప్రారంభించారు. అనంతరం సదస్సులో ఆయన మాట్లాడుతూ.. గడిచిన మూడున్నరేళ్లలో ఆర్ధికంగా రాష్ట్రం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కోవిడ్‌ వంటి కష్టకాలంలో సైతం అప్పటి పరిస్థితులను అధిగమించామని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వం అందేసిన పథకాలు ప్రజలకు అండగా నిలిచాయన్నారు. ఇప్పుడు కీలక సమయంలో సదస్సు నిర్వహించామని.. పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నామన్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా 15 సెక్టార్లలో సెషన్స్‌ జరిగాయని.. అందులో భాగంగా రెండు రోజుల్లో 352 ఎంవోయూలు పూర్తయినట్లు పేర్కొన్నారు. వందకు పైగా స్పీకర్లు పాల్గొని ప్రసగించారన్నారు. అందరి పెట్టుబడులతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే దిశగా.. చిత్తశుద్ధితో ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని సీఎం తెలిపారు.

జీఐఎస్‌తో మొత్తం పెట్టుబడులు ఎంతంటే..
జీఐఎస్ ద్వారా సీఎం జగన్‌ ముందుగా ప్రకటించినట్లు సుమారు మొత్తం రూ. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. దీని ద్వారా సుమారు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఏర్పడింది. మొత్తం పెట్టుబడుల్లో 8 లక్షల 84 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం ఎనర్జీ రంగంలో వచ్చాయి. గ్రీన్ ఎనర్జీతో భారత దేశ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ప్రయాణం కీలకం కానుంది. ఇక పర్యాటక రంగంలో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. తొలి రోజు రూ.11లక్షల 87 వేల 756 కోట్లకు ఎంవోయూలు జరగగా.. అందులో ఎన్టీపీసీ రూ. 2..35 లక్షల కోట్ల ఎంవోయూతో అగ్రగామిగా నిలిచింది. ఇక రెండో రోజైన శనివారం ఏపీ ప్రభుత్వంతో 45 ఒప్పందాలు(ఎంవోయూలు) వివిధ కంపెనీలతో కుదిరాయి. పలు ప్రతిష్టాత్మక కంపెనీలు దాదాపు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు కుదుర్చుకున్నాయని సమాచారం. అందులో రిలయన్స్ కంపెనీ సుమారు 50 వేల కోట్ల రూపాయలతో అగ్రగామిగా నిలిచింది. దీంతో రెండు రోజులు కలిసి దాదాపు 13 లక్షల కోట్లకు ఏపీలో ఇన్వెస్ట్‌ చేయడానికి పలు కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.