సాలార్‌జంగ్‌ మ్యూజియాన్ని ఇంట్లో నుంచే చూడొచ్చు!

అరుదైన పురాతన శిల్పాలు, చిత్రాలు, రాజులు ధరించిన వినూత్న దుస్తులు, మను స్క్రిప్ట్‌లు, సిరామిక్స్‌, హస్తకళలు, చరిత్రకు సంబంధించిన అనేక వస్తువులు, రాజుల కాలం నాటి కత్తులు, ఇతర వస్తువులన్నీ మనం హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో చూస్తుంటారు. ఈ మ్యూజియాన్ని చూసేందుకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి వస్తుంటారు. ఇదే క్రమంలో మరి కొందరు రాలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి వారికోసం మ్యూజియం నిర్వాహకులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. ఇకపై మ్యూజియంలోని అనేక వస్తువులను ఆన్‌లైన్‌లోనే వీక్షించవచ్చు. దీనికి అనుగుణంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించి అందులో పొందుపరిచారు. ఇందులో సింబల్స్‌ ఆఫ్‌ గ్లోరీ పేరుతో ఆనాటి రాజుల దర్పం ప్రతిబింబించేలా ఇరువైపులా పదును ఉండే కత్తి, సాలార్‌జంగ్‌-3 ఖడ్గం, షంషీర్‌, నాగన్‌ తదితరాలకు సంబంధించిన వివరాలు, చిత్రాలను నిక్షిప్తం చేశారు.

వెబ్‌సైట్‌ వివరాలు ఏ విధంగా చూడాలంటే..
‘గూగుల్‌ ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌’ ప్రాజెక్టులో భాగంగా వీటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు మ్యూజియం డైరెక్టర్‌ ఎ.నాగేందర్‌రెడ్డి తెలిపారు. మ్యూజియం సందర్శనకు సమయం లేనివారికి ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు వివరించారు. డిజిటల్‌ వెర్షన్‌లో అరుదైన, పురాతన శిల్పాలు, చిత్రాలు, రాజులు ధరించిన వినూత్న దుస్తులు, మను స్క్రిప్ట్‌లు, సిరామిక్స్‌, హస్తకళలను ప్రదర్శిస్తున్నారు. వాటన్నింటినీ https://artsandculture.google.com/partner/salar-jung-museum వెబ్‌సైట్‌ను సందర్శించి చూడవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘వండర్స్‌ ఇన్‌ వుడ్‌’ పేరుతో చెస్‌ ఆట పురోగతి, రెండో నిజాం సాహసయాత్ర, రాయల్‌ దక్కనీ కళాపోషణ వివరాలను కూడా డిజిటలైజ్‌ చేశారు. వీటితోపాటు మ్యాజిక్‌ ఆఫ్‌ బ్రాంజ్‌, ఇండియన్‌ ఎపిక్స్‌ ఇన్‌ ఆర్ట్స్‌, ఏ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ – హౌ చెస్‌ కాంకర్డ్‌ ది వరల్డ్‌, భారతదేశ చరిత్రకు సంబంధించిన 467 ముఖ్యమైన చిత్రాలు, హైదరాబాద్‌ చరిత్రకు సంబంధించి 387 చిత్రాలు, ఫైబర్‌ ఆర్ట్‌ తదితర వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పడే వెబ్‌సైట్‌కు వెళ్లి అన్నీ చూసేయండి.