Avinash Reddy: సజ్జల యూటర్న్..ప్రభుత్వానికి సంబంధం లేదు!
Hyderabad: వైఎస్ వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డిని(avinash reddy) విచారణకు రావాలని పలు దఫాలు నోటీసులు జారీ చేశారు. అయితే.. అవినాష్ తల్లి అనారోగ్యం కారణంగా ఆయన విచారణకు ఇప్పుడే హాజరు కానని ఈ నెల 27న వస్తానని తెలిపారు. దీనికి సీబీఐ అధికారులు అంగీకారం తెలపలేదు. మరోవైపు అవినాష్‌ను తీసుకెళ్లేందుకు కర్నూల్‌కు వచ్చారు. కానీ అవినాష్ మాత్రం తన తల్లి అనారోగ్యం కారణంగా.. తాను విచారణకు హాజరుకానని చెబుతున్నారు. ఈక్రమంలో సీబీఐ అధికారులు కర్నూల్ జిల్లా ఎస్పీని కలిసి.. అవినాష్ అరెస్టుకు సహకరించాలని కోరారు. కానీ అధికారులకు ఎలాంటి సహకారం లభించలేదు.
ఈ విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. అవినాష్ అరెస్టు కాకుండా.. వైసీపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని వార్తలు రాశారు. దీంతో ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందించారు. సీబీఐ చేస్తున్న విచారణతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ఈ విషయంలో సీఎం జగన్ ఎక్కడా జోక్యం చేసుకోలేదని ఏపీ ప్రభుత్వ సజ్జల (sajjala ramakrishna reddy) పేర్కొన్నారు. ”ఒక బాధ్యత కలిగిన ఎంపీగా అవినాష్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన ఎక్కడా తప్పించుకోలేదు.. ఇప్పటికే ఆరేడుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. తన తల్లికి బాగోలేకపోవడంతో విచారణకు హాజరు కాలేనని అవినాష్ చెప్పారని… అవినాష్ అరెస్టుకు కర్నూలు ఎస్పీ సహకరించడలేదనడం సరికాదని” సజ్జల అన్నారు. ఇక ఇప్పటి వరకు అవినాష్ రెడ్డికి మద్దతుగా సాక్షి మీడియా, వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ నాయకులు ఉన్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే.. ఒకవేళ అవినాష్ అరెస్టు అయితే.. వైసీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా.. ఉండేలా సజ్జల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. అవినాష్‌ను ఓన్ చేసుకోవడం వల్ల పార్టీకి కూడా మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.