మరో ఘనత దక్కించుకున్న RRR!
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. గత ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విజువల్ వండర్‌గా గుర్తింపుపొంది దాదాపు రూ.1200 కోట్లు వసూలు చేసి ఇండియా టాప్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఆస్కార్‌కి వెళ్లి హాలీవుడ్‌లోనూ ఆర్ఆర్ఆర్ తనదైన గుర్తింపును సంపాదించుకుని అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటూ రికార్డులు సృష్టిస్తోంది.
థియేటర్లలో RRR (రౌద్రం రణం రుధిరం) సినిమా భారీ ప్రభావాన్ని చూపించిదని అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఓటీటీలోనూ ఈ మూవీ అదే దూకుడును ప్రదర్శించింది. ఫలితంగా స్ట్రీమింగ్ చేసిన జీ5, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌లలో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతూ అందరి దృష్టిలో పడింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా ప్రపంచ వ్యాప్తంగా దుమ్ముదులపడంతో పాటు ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా సొంతం చేసుకుంది. అలాగే, ఆస్కార్‌కు సైతం నామినేట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ మరో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సొంతం చేసుకుని రికార్డు సాధించింది.
ఐదు ప్రతిష్టాత్మక అవార్డులు..
అమెరికాలో ఈ రోజు జరిగిన ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ (HCA Awards 2023) అవార్డుల్లో సైతం ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటింది. మొత్తం మీద ఈ సినిమాకు ఐదు పురస్కారాలు వచ్చాయి. ‘ఆర్ఆర్ఆర్’కు వచ్చిన అవార్డుల్లో ముఖ్యమైనవి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’ & ‘బెస్ట్ యాక్షన్ ఫిల్మ్’. ఈ రెండు విభాగాల్లో అంతర్జాతీయంగా భారీ వసూళ్ళు సాధించిన, ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలు ఉన్నాయి. వాటిని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’కు అవార్డులు ఇచ్చారు. బెస్ట్ స్టంట్స్ విభాగంలో కూడా ‘ఆర్ఆర్ఆర్’ అవార్డు అందుకుంది. ‘ఆర్ఆర్ఆర్’లో ‘నాటు నాటు…’ పాటకు ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు వచ్చింది. ఆస్కార్ నామినేషన్ అందుకుంది. ఇప్పుడు ఆ పాటకు ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అవార్డు కూడా వచ్చింది.
‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ నుంచి ‘ఆర్ఆర్ఆర్’కు వచ్చిన మరో పురస్కారం… హెచ్.సి.ఎ స్పాట్ లైట్ అవార్డు. గత ఏడాది డిసెంబర్ తొలి వారంలో ఆ అవార్డు అనౌన్స్ చేశారు. దానిని ఈ రోజు అందజేశారు. అవార్డు అందుకున్న తర్వాత దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ ”మా ‘ఆర్ఆర్ఆర్’ కథా రచయిత, మా నాన్నగారు విజయేంద్ర ప్రసాద్… సంగీత దర్శకుడు, మా అన్నయ్య ఎం.ఎం. కీరవాణికి థాంక్స్. అలాగే, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ కి కూడా! ఇతను మా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్. మేం ఎనిమిది సినిమాలకు కలిసి పని చేశాం. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, కాస్ట్యూమ్ డిజైనర్ రామ, ఇతరులు అందరికీ థాంక్స్. మా రామ్ (అల్లూరి సీతారామ రాజుగా నటించిన రామ్ చరణ్), నా భీమ్ (కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్) మూడేళ్ళు ఈ సినిమా కోసం తమ విలువైన సమయాన్ని కేటాయించారు. అందరికీ థాంక్స్” అని అన్నారు.