సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య.. ప్రేయసికి ఊరట
Sushant Singh Rajput: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నటి, సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తికి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. ఈ కేసుని సీబీఐ, NCB సంస్థలు దర్యాప్తు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రియాపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసారు. ఈ సర్క్యులర్ జారీ అయితే రియా, ఆమె కుటుంబీకులు దేశాన్ని విడిచి వెళ్లలేరు. దాంతో రియా తరఫు న్యాయవాది లుకౌట్ సర్క్యులర్ రద్దు చేయాలని.. అనుమానితురాలిగా ఉన్న రియా, ఆమె సోదరుడు షోవిక్‌లు విచారణకు సహకరించారని వెల్లడిస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దాంతో మహారాష్ట్ర రాష్ట్రం, ఇమ్మిగ్రేషన్ బ్యూరోలు కలిసి బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు. దీనిపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెల్లడిస్తూ పిటిషన్ వేసిన సంస్థలపై మండిపడింది. చనిపోయింది ఒక నటుడు. అనుమానితురాలిగా ఓ నటి ఉందన్న ఒక్క కారణంతో మీరు ఇష్టమొచ్చినట్లు నోటీసులు ఇచ్చేస్తారా? రియాకి లుకౌట్ నోటీసులు ఎందుకు? ఆమె విచారణకు సహకరించిందిగా? అసలు మీరు చార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేదు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
2020 జూన్ 14న సుశాంత్ తన ఫ్లాట్‌లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కారణం సుశాంత్ గురించి తప్పుడు వార్తలు రాయించిన కరణ్ జోహార్, డ్రగ్స్ అలవాటు చేసిన ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ అంటూ సుశాంత్ కుటుంబీకులు కేసు పెట్టారు. కరణ్‌పై కేవలం ఆరోపణలు మాత్రమే ఉండటంతో పోలీసులు రియా, షోవిక్‌లను అదుపులోకి తీసుకుని నెల రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత ఇద్దరికీ బెయిల్ వచ్చింది. ఇప్పటికీ ఈ కేసులో నిందితులు ఎవరు అనేది తెలియరాలేదు.