‘దమ్ముంటే నువ్వు రా బిడ్డా’ అంటూ రేవంత్ ఫైర్
తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ తలపెట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ఉద్రిక్తత నడుమ కొనసాగుతోంది. ఈ సందర్బంగా మంగళవారం రాత్రి భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతుండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నిరసన తెలియజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి వైపు దూసుకొచ్చేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అంతటితో వారు ఆగకుండా పోలీసులను తోసివేసి.. ముందుకొచ్చి.. రేవంత్ రెడ్డి వాహనం ఎక్కి మాట్లాడుతుండగా ఆయనపైకి కోడి గుడ్లు, రాళ్లు, టమాటాలు విసిరారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి భూపాలపల్లి వస్తున్నారని తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల నడుమ ఫ్లెక్సీల ఏర్పాటు విషయమై గొడవ జరిగింది. కార్యకర్తల మధ్య తోపులాటలు జరిగాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యేకి చెందిన ఓ థియేటర్లో మకాం వేశారు.
రేవంత్ రెడ్డి భూపాలపల్లి సెంటర్‌కు చేరిన వెంటనే ఆయనపై దాడి చేసేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు యత్నించారు. ఇక ఆయన తలపెట్టిన కార్నర్ మీటింగ్ ప్రారంభించిన వెంటనే పీసీసీ సభ్యుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతున్న తరుణంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు చెప్పులు, టమాటలు, కోడిగుడ్లు విసిరారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తుండగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు మరోసారి కోడిగుడ్లు, టామాటలు విసరడంతో మరింత ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురు దాడికి దిగారు. కంకర రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లను బీఆర్‌ఎస్ కార్యకర్తలపై విసిరారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు పరుగులు తీశారు. వారిని ఉరికిస్తూ కొద్ది దూరం కాంగ్రెస్ శ్రేణులు వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. మరోవైపు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపు చేసేందుకు విధుల్లో ఉన్న కాటారం ఎస్సై శ్రీనివా్‌సతోపాటు పలువురు కానిస్టేబుళ్లకు, ఇరు పార్టీల కార్యకర్తలకు రాళ్ల దెబ్బలు తగిలి తీవ్ర గాయాలయ్యాయి.
అధికారం శాశ్వతం కాదని పోలీసులు గుర్తుంచుకోవాలి – రేవంత్
కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిపై రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఉరికిచ్చి కొట్టకపోతే నేను ఇక్కడే గుండు కొట్టించుకొని పోతా..’ అంటూ స్థానిక ఎమ్మెల్యే గండ్రను ఉద్దేశించి సవాలు విసిరారు. పోలీసుల అండతో తమ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని.. సభ పెట్టుకుంటే ఆవారాగాళ్లు దాడులు చేస్తే పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూస్తారా..? అని రేవంత్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు ఎస్పీ చుట్టమని పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారా..? అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని అన్నారు. అంతకుముందు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కేటీకే 5వ గనిలో సింగరేణి కార్మికులతో రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక సంఘాలపై కేసీఆర్ కుటుంబమే పెత్తనం చలాయిస్తోందని విమర్మించారు.