TSPSC పరీక్ష పత్రాల లీక్‌లో రేణుకదే కీ రోల్!

టీఎస్‌పీఎస్సీలో పరీక్ష పత్రాల లీకేజీ అంశానికి సంబంధించి కొత్త వ్యక్తుల పేర్లు వెలుగులోకి రావడం అది కూడా ఓ హిందీ ఉపాధ్యాయిని ప్రధాన సూత్రధారి కావడం సంచలనం రేపుతోంది. ఇక ఈ కేసును బేగంబజార్‌ ఠాణా నుంచి సీసీఎస్‌కు బుధవారం బదిలీ చేశారు. సిట్‌ ప్రధాన అధికారి ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే వారి కస్టడీలో ఉన్న ప్రవీణ్‌ పలువురి పేర్లను బయటపెట్టారు. అందులో ఓ మహిళా ఉపాధ్యాయిని ఉండటం కలకంల రేపుతోంది. ఆమె చుట్టూనే ఏఈ పరీక్ష పత్రాల లీక్‌ విషయం నడిచినట్లు సమాచారం. ఆమె పేరు రేణుక రాథోడ్‌ వరఫ్‌ రేణుక అని.. వనపర్తి జిల్లా బుద్ధారం గ్రామ పరిధిలోని బాలికల ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తమ్ముడి పేరుతో ఏఈ ప్రశ్నపత్రాలు సంపాదించేందుకు రేణుక తెరవెనుక పెద్ద తతంగం నడిపింది. పక్కా ప్రణాళికతో ఏఈ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులతో భారీ మొత్తానికి బేరం కుదుర్చుకుంది. దీని ద్వారా లక్షలు కాజేయవచ్చని ప్లాన్‌ చేసిందని దర్యాప్తులో వెలుగుచూసింది.

ప్రవీణ్‌ను రేణుక ఎలా సంప్రదించిందంటే..
రేణుక సోదరుడు రాజేశ్వర్‌ టీటీసీ చేసి చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో అతన్ని అడ్డంపెట్టుకుని పరీక్ష పత్రాలు తెప్పించుకోవాలని రేణుక ప్లాన్‌ చేసింది. అనుకున్నట్లుగానే తన తమ్ముడికి ఏఈ ప్రశ్నపత్రాలు కావాలంటూ రూ.10 లక్షలకు ప్రవీణ్‌తో ఒప్పందం చేసుకుంది. ఏఈ పరీక్ష రాసేందుకు అతనికి అర్హత లేదు. దీంతో ఏఈ పరీక్షలకు సిద్దమవుతున్న మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కె.నీలేష్‌నాయక్‌, పి.గోపాల్‌ నాయక్‌లకు ఏఈ ప్రశ్నపత్రాలు అందజేస్తానని రేణుక రూ.14 లక్షలకు బేరం కుదుర్చుకుంది. వారి వద్ద డబ్బు తీసుకుని ప్రవీణ్‌కు పది లక్షలు ఇచ్చింది. వాటిని అతను తన బ్యాంకు ఖాతాలో కొంత… మరికొంత రాజమండ్రిలోని అతని బాబాయికి ఆన్‌లైన్‌లో పంపాడు. ప్లాన్‌ ప్రకారం.. పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్‌కు ప్రవీణ్‌ డబ్బు ఆశచూపి ప్రశ్నపత్రాలను సంపాదించి.. రేణుకకు పంపాడు. ఈక్రమంలోనే పేపర్లు లీకైనట్లు వెలుగుచూసింది.

ఎస్సై పరీక్ష పేపర్లు లీక్‌ చేయడానికి యత్నం..
ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలే కాకుండా.. ఎస్సై ప్రశ్నపత్రాలు కూడా లీకు చేసేందుకు రేణుక యత్నించింది.. దీనిలో భాగంగా.. మహబూబ్‌నగర్‌ జిల్లా మన్సూర్‌తల్లి తండాకు చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ కె.శ్రీనివాస్‌ను ఆమె అప్రోచ్ అయ్యింది. అతను ప్రస్తుతం మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఎస్సై ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షలో పాసయ్యాడు. దీంతో మెయిన్స్‌ ప్రశ్నపత్రం విక్రయిస్తామంటూ రేణుక అతనికి ఫోన్‌ చేసింది. ఈక్రమంలో అతను తనకు అవసరం లేదని చెప్పాడు. ఏఈ పరీక్షలకు సిద్ధమవుతున్న కొందరు అభ్యర్థుల సమాచారం కావాలని ఆమె కోరగా.. పలువురి వివరాలు ఆమెకు ఇచ్చాడు. ఓ పోలీసు అయి ఉండి జరుగుతున్న నేరం గురించి సమాచారం ఇవ్వకపోవడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. సీపీ కార్యాలయానికి అతనిపై నివేదిక పంపినట్లు సమాచారం.

ప్రవీణ్‌ ఫోన్లో 100 మంది మహిళల నెంబర్లు.. వీడియోలు..
పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రవీణ్‌ ఫోన్‌లో 100 మందికి పైగా మహిళల ఫోన్‌ నంబర్లున్నాయి. అందులో సుమారు 42 మంది మహిళల అర్ధనగ్న, నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నట్టు సమాచారం. ఇవన్నీ అంతర్జాలం నుంచి డౌన్‌లోడ్‌ చేసినవా.. లేదా వారితో ఉన్నప్పుడు వీడియో తీసినవా అన్నది ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా తెలియాల్సి ఉంది. ఇక ప్రవీణ్‌ను అధికారులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రశ్నపత్రాల లీకైనట్లు తెలియగానే టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోకి వచ్చే సిబ్బంది వివరాలను అధికారులు ముందుగా సేకరించారు. కంప్యూటర్లు, ల్యాన్‌ ఉన్న గదుల్లోకి ప్రవీణ్‌కుమార్‌ వచ్చినట్టు గుర్తించారు. ఈక్రమంలో ఓ ఉద్యోగి ప్రవీణ్‌పై అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు అతని పేరును చెప్పాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తుండగా.. అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రభుత్వ పరీక్ష ఉన్నప్పుడల్లా రేణుక సెలవులో..
రేణుక ఈ ఏడాది జనవరి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకునే రోజు వరకు మొత్తం 16 రోజులు సెలవు పెట్టినట్లు ఆమె పనిచేసే స్కూల్‌ ప్రిన్సిపల్‌ పేర్కొన్నారు. జనవరిలో 23, 28, 31 తేదీల్లో, ఫిబ్రవరిలో 1వ తేదీ, 4 నుంచి 8 వరకు, 24న సెలవు రేణుక సెలవు పెట్టింది. ఈ నెల 4, 5 తేదీల్లోనూ (ఏఈ పరీక్ష జరిగిన రోజులు) సెలవు తీసుకుంది. ఇంట్లో వారికి బాలేదని చెబుతూ.. సెలవులు తీసుకునేదని ప్రిన్సిపల్‌ చెబుతున్నారు. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌(టీపీబీవో) పోస్టుల రాతపరీక్ష ఈ నెల 12న జరగాల్సి ఉండగా.. 10, 11, 12, 13 తేదీల్లో ఆమె సెలవులు పెట్టింది. దీనికి తన ఇంట్లో ఒకరు చనిపోయారని కారణం చెబుతూ.. ప్రిన్సిపల్‌కు వాట్సప్‌ సందేశం పంపింది. ఈ వ్యవహారమంతా చూస్తే.. పెద్దఎత్తునే పరీక్ష పత్రాలు లీకవుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఏఈ పరీక్షతో పాటు.. తదుపరి నిర్వహించాల్సిన పరీక్ష పత్రాలు కూడా లీకైనట్లు ఆమె పెట్టిన సెలవులను చూస్తే అర్థమవుతోందని కొందరు చెబుతున్నారు.

బీఆర్‌ఎస్‌ హస్తం ఉంది… – బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌
పరీక్ష పత్రాలు లీక్‌ చేసిన రేణుక తల్లి బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున గెలిచిన గ్రామ సర్పంచి అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ వ్యవహారానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధాలు ఉన్నట్లు బీజేపీ అనుమానిస్తోందని ఆయన మండిపడ్డారు. కేసును నిష్ఫక్షిపాతంగా దర్యాప్తు చేపట్టాలని సిట్‌ను ఆయన కోరారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఏ1 ప్రవీణ్‌, ఏ2 రాజశేఖర్‌, ఏ3 రేణుక, ఏ4గా రేణుక భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.