సుస్మితా సేన్‌కు అందుకే గుండెపోటు వ‌చ్చిందా?

మాజీ విశ్వ‌ సుంద‌రి సుస్మితా సేన్ గుండెపోటుకు గురైన సంగ‌తి తెలిసింది. ఈ విష‌యాన్ని ఆవిడే స్వ‌యంగా సోషల్‌మీడియా ద్వారా ప్ర‌క‌టించ‌డంతో ఫ్యాన్స్, నెటిజ‌న్లు షాక్‌కు గుర‌య్యారు. “కొన్ని రోజుల క్రితం నాకు గుండెపోటు వ‌చ్చింది. వెంట‌నే కార్డియాల‌జిస్ట్ ఏంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేసారు. నా గుండె చాలా గ‌ట్టిది అని కార్డియాల‌జిస్ట్ చెప్ప‌డంతో ధైర్యం వ‌చ్చింది. మ‌న గుండెని ధైర్యంగా, ఆనందంగా ఉంచుకున్న‌ప్పుడే అవ‌స‌రంలో అది మ‌న‌కు తోడుగా నిలుస్తుంది అని మా నాన్న చెప్తుండేవారు. ఇప్పుడు నా ఆరోగ్యం విష‌యంలో భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. ఈ విష‌యం ఎందుకు చెప్తున్నానంటే.. ఫ్యాన్స్, నెటిజ‌న్లు ఆయురారోగ్యాల‌తో సంతోషంగా ఉండాల‌ని, ఎటువంటి స్ట్రెస్ తీసుకోకూడ‌ద‌ని మీతో ఈ విష‌యాన్ని పంచుకుంటున్నాను”అని వెల్ల‌డించారు.

అయితే సుస్మితా సేన్‌కు గుండెపోటు రావ‌డంపై అటు సెల‌బ్రిటీలు, ఇటు నెటిజ‌న్లు షాక్‌కు గుర‌వుతున్నారు. ఎందుకంటే 47 ఏళ్ల వ‌య‌సులోనూ సుస్మిత యోగా, జిమ్ చేస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఫిట్‌గా ఉంటున్నారు. అలాంటి సుస్మిత‌కు గుండెపోటు రావ‌డం ఏంటి అంటూ తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. అయితే ఆమెకు గుండెపోటు రావడానికి కార‌ణం ఆడిస‌న్స్ వ్యాధి అని ప‌లువురు వైద్య నిపుణులు చెప్తున్నారు. సుస్మిత కొన్నేళ్లుగా ఆడిస‌న్స్ స‌మస్య‌తో బాధ‌ప‌డుతున్నారు.అంటే మ‌న శ‌రీరంలోని అడ్రిన‌ల్ గ్రంధులు స‌రిగ్గా హార్మోన్ల‌ను విడుద‌ల చేయ‌క‌పోతే ఈ స‌మ‌స్య వ‌స్తుంది. దీనిని ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటారు. అడ్రిన‌ల్ గ్రంధుల నుంచి విడుద‌ల‌య్యే కార్టిసాల్ హార్మోన్ త‌క్కువ‌గా ఉంటే.. బ్ల‌డ్ ప్రెష‌ర్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. 2014లో సుస్మిత‌కు ఈ స‌మ‌స్య వ‌చ్చింది. దాంతో ఆమె చికిత్స‌లో భాగంగా స్టెరాయిడ్లు తీసుకుంటోంది. ఆ స్టెరాయిడ్ల వ‌ల్లే సుస్మిత‌కు గుండెపోటు వ‌చ్చి ఉంటుంద‌ని కొంద‌రు నిపుణులు భావిస్తున్నారు. అదీకాకుండా ఈ అడిస‌న్స్ వ్యాధి గుండెపై కూడా తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ట‌.

ఇక సుస్మితా సేన్ సినిమాల విష‌యానికొస్తే.. ఇటీవ‌ల ఆమె ఆర్య అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. త్వ‌ర‌లో దీని పార్ట్2 విడుద‌ల కానుంది. గుండెపోటు వ‌చ్చి స్టెంట్ వేయ‌డంతో కొన్ని నెల‌ల పాటు ఆమె విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించార‌ట‌.