రామ్ చ‌ర‌ణ్‌.. గేమ్ ఛేంజ‌ర్‌

ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ప్రముఖ కోలీవుడ్​ దర్శకుడు శంకర్​తో కలసి ఓ భారీ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ‘ఆర్ సి 15’ వర్కింగ్​ టైటిల్​తో ఇన్నాళ్లు షూటింగ్ పనులు జరిగాయి. ఈ సినిమాకి ఏ పేరు పెడతారా? అని చాలాకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. అయితే మూవీ టైటిల్ కు సంబంధించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తామని మేకర్స్​ ప్రకటించడంతో ఆ క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారంతా. అందరూ అనుకున్నట్టుగానే నేడు(మార్చి 27) రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. రామ్ చరణ్ 15 వ సినిమాకు ‘గేమ్ ఛేంజర్’ అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ వీడియోను విడుదల చేశారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. టైటిల్ అదిరిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టైటిల్ రివీల్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ మూవీతో ఆయనకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. దీంతో శంకర్-చెర్రీ సనిమాకు ముందు అనుకున్న పేర్లు కాకుండా గ్లోబల్ స్థాయిలో ఉండాలని ఈ ‘గేమ్ చేంజర్’ పేరును ఫిక్స్ చేశారని సమాచారం. ముందు ఈ సినిమాకు ‘సీఈవో’, ‘సర్కారోడు’ అనే టైటిల్‌ను అనుకున్నారట. ‘అధికారి’ అనే టైటిల్ ను కూడా అనుకున్నారు కానీ తర్వాత రామ్ చరణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ టైటిల్ ను ఖరారు చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అడ్వాణీ నటిస్తున్న సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ టైటిల్ మెగా అభిమానులతోపాటు తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. ఇక టైటిల్ రివీల్ వీడియోను గమనిస్తే చదరంగం కాన్సెప్ట్ లా కనిపింస్తోంది. రాజు, రాజు చుట్టూ భటులు ఉన్నట్టు చూపించారు. అంతేకాదు అసెంబ్లీ లుక్ కూడా కనిపిస్తోంది. అయితే ఇందులో రామ్ చరణ్ పాత్ర ఎన్నికల అధికారి పాత్ర చేస్తున్నారా.. లేకపోతే అలాంటి బలమైన పాత్ర గేమ్​ ఛేంజర్​గా మారుతుందా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్​ అయ్యేవరకు ఆగాల్సిందే. ఏదేమైనా చెర్రీ పుట్టినరోజున టైటిల్​ రివీల్​ చేసి మెగా అభిమానులకు అదిరిపోయే సర్​ప్రైజ్​ ఇచ్చింది చిత్రయూనిట్​.