Ravindra Jadeja: నా గాయాలకు ఇదే కారణం కావచ్చు
Ravindra Jadeja: మైదానంలో చురుకుగా ఫీల్డింగ్ చేయడం వల్లనే తాను వరుసగా గాయాపడుతున్నానని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ టెస్ట్‌లో తొడ కండరాల గాయానికి గురైన జడేజా.. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ ఆడలేదు. NCAలో చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకొని మూడో టెస్ట్‌కు అందుబాటులోకి వచ్చాడు. అయితే తుది జట్టులో అతనికి చోటు దక్కుతుందా..? మరో మ్యాచ్ వరకు టీమిండియా మేనేజ్‌మెంట్ వేచి చూస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
రాజ్‌కోట్ వేదికగా నేటి నుంచి భారత్-ఇంగ్లండ్ మూడో టెస్టు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టుల్లో చెరో మ్యాచ్ గెలిచి ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. రాజ్‌కోట్ టెస్టులో విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యానికి దూసుకెళ్లాలని ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం రవీంద్ర జడేజా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తాను తరుచు గాయపడటానికి గల కారణాన్ని వెల్లడించాడు. మైదానంలో హాట్‌స్పాట్‌లో ఫీల్డింగ్ చేయడమే తన వరుస గాయాలకు కారణం కావచ్చని అభిప్రాయపడ్డాడు. (Ravindra Jadeja)
‘వరుసగా గాయాల బారిన పడటం చికాకుకు గురిచేస్తోంది. కానీ ఈ రోజుల్లో క్రికెట్ మ్యాచ్‌లు పెరగడంతో గాయాలు కావడం సాధారణమైంది. మైదానంలో నేను దాక్కోను. నేను ఎప్పుడూ ఏ ఫార్మాట్‌లోనైనా హాట్‌స్పాట్‌లో ఫీల్డింగ్ చేస్తాను. నా వరుస గాయాలకు ఇదే కారణం కావచ్చు. బంతి తరుచూ నా దగ్గరికి వస్తూ ఉంటోంది.
నేను అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తానని, సూపర్ క్యాచ్ అందుకుంటాననే అంచనా జట్టుకు ఉంది. అలా ఉండటం మంచిదే. ఇక గాయాల బారిన పడకుండా నేను తెలివిగా ఫీల్డింగ్ చేయగలను. జాగ్రత్తగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ మళ్లీ గాయాల బారిన పడననే గ్యారెంటీ అయితే లేదు.
జట్టు కోసం నేను 100 శాతం నా ఎఫర్ట్ పెడుతాను. నా శరీరాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తాను. డైవింగ్ అవసరం లేని చోట చేయను. ఈ విషయంపై నేను పెద్దగా ఆలోచించడం లేదు. ఎందుకంటే గాయం నుంచి కోలుకొనే వస్తున్నాను. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాను. మ్యాచ్ జరగుతున్నప్పుడు శరీరం అటోమెటిక్‌గా ఆ ఫ్లోను అందుకుంటుంది. గాయమైందనే ఆలోచన మదిలో నుంచి పోతుంది. ఒకటి రెండు రోజుల్లోనే నేను రిథమ్ అందుకుంటాను.’అని రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు.
మా ప్లాన్ అదే
అయితే ఇంగ్లండ్‌ను ఎదుర్కోవడానికి తమ దగ్గర ప్రణాళిక ఉందని ఆల్‌రౌండర్ జడేజా పేర్కొన్నాడు. పరుగులు సమర్పించుకునేలా తమ జట్టు బౌలింగ్ చేయదని తెలిపాడు.
‘ఇంగ్లండ్ టీమ్‌ది దూకుడుగా ఆడే స్వభావం. ఇక్కడ పరిస్థితుల్లో ప్రత్యర్థి జట్టు దూకుడుగా ఆడటం గతంలో అంత సులువు కాదు. కానీ ఇంగ్లండ్ హిట్టింగ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. కొన్నిసార్లు వాళ్లు కనెక్ట్ అవుతారు, మరికొన్నిసార్లు కనెక్ట్ అవ్వలేరు. అయినా అదే తరహాలో వాళ్లు బ్యాటింగ్ చేస్తారు. ఈ స్థితిలో మనం ప్లాన్-బి గురించి ఆలోచించాలి. మన ఫీల్డింగ్ ఎలా ఉంది? దానికి తగ్గట్లుగా బంతులు సంధించాలి. వాళ్లకు పరుగులు సమర్పించేలా మేం బౌలింగ్ చేయం’ అని తెలిపాడు.
ఒక బాల్ టర్న్ అవుతూ, మరో బాల్ నేరుగా వికెట్లకు నేను సంధిస్తా. అదే నా ప్లాన్. ఇక పిచ్ విషయానికొస్తే కఠినంగా అనిపిస్తుంది. మొదట్లో వికెట్ బాగుటుంది. ఆ తర్వాత వికెట్ స్లో అవుతుందనుకుంటున్నా” అని జడేజా తెలిపాడు. తొలి టెస్టులో గాయపడి రెండో టెస్టుకు దూరమైన జడేజా మూడో టెస్టులో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.