నీ వాయిస్ బాగుందని వచ్చా.. యువతితో ర్యాపిడో డ్రైవర్ అసభ్య ప్రవర్తన
తన బైక్ బుక్ చేసుకున్న పాపానికి ఓ యువతికి చుక్కలు చూపించాడు ర్యాపిడో డ్రైవర్. ఆమె నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతుండడంతో ఆ యువతి ధైర్యం చేసి అతనికి ఎలాగైనా బుద్ధిచెప్పాలని సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు పెట్టింది. బాధితురాలు తన వివరాలు వెల్లడించకుండా కేవలం స్క్రీన్ షాట్లు పెట్టడంతో వెంటనే ర్యాపిడో సంస్థ కలగజేసుకుని న్యాయం చేకూరేలా చర్యలు చేపట్టింది.
మొన్న ఆదివారం ఆ యువతి ర్యాపిడో బుక్ చేసుకుంది. ప్రయాణ సమయంలో కస్టమర్లు తమ లొకేషన్, ఫోన్ నెంబర్లు షేర్ చేయాల్సి ఉంటుంది. కొందరు ఆకతాయిలు ఇదే అదనుగా అమ్మాయిల నెంబర్లు సేవ్ చేసుకుని వారికి మెసేజ్‌లు చేయడం లాంటివి చేస్తున్నారు. ఇదే పరిస్థితి ఆ అమ్మాయి కూడా ఎదురైంది. నెంబర్ సేవ్ చేసుకున్న డ్రైవర్ ఆ అమ్మాయికి వాట్సాప్‌లో మెసేజ్‌లు చేసాడు. హలో. పడుకున్నావా? నీ డీపీ చూసి, నీ గొంతు విని నిన్ను పికప్ చేసుకోవడానికి ఒప్పుకున్నా లేదంటే అంత దూరం వచ్చేవాడిని కాదు. ఇంకోమాట.. నన్ను అన్నయ్య అనకు. సరేనా అంటూ మెసేజ్‌లు చేసాడు. ఇక విసిగిపోయిన ఆ యువతి తన వివరాలు బయటపెట్టకుండా ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ.. నా లొకేషన్ ర్యాపిడో డ్రైవర్‌కి షేర్ చేస్తే వాడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు. అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ యువతికి ఎందరో నెటిజన్లు మద్దతుగా నిలవడంతో ర్యాపిడో సంస్థ స్పందించింది. డ్రైవర్ ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు. మీకు ఇలాంటి చేద ఘటన ఎదురైనందుకు చింతిస్తున్నాం. క్షమించండి. ఎలాగైనా అతనిపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తాం. మీ ఫోన్ నెంబర్, మీరు బుక్ చేసిన ఐడీ వివరాలను మాకు మెసేజ్ చేయండి అని ఆమెకు హామీ ఇచ్చారు.
గతంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి చెందిన డెలివరీ ఏజెంట్ కూడా ఇలాగే ప్రవర్తించాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న ఓ మహిళకు పార్సిల్ ఇవ్వడానికి వెళ్లి తిరిగి వచ్చాక మిస్ యూ, మీరు చాలా అందంగా ఉన్నారు అంటూ ఆమెకు మెసేజ్‌లు చేసి హింసించాడు. వెంటనే ఆ బాధితురాలు స్విగ్గీ టీంను ఆశ్రయించడంతో ఆ వ్యక్తికి సరైన గుణపాఠం చెప్పారు.