Rana Naidu: అభిమానులకు రానా క్షమాపణ

టాలీవుడ్​ స్టార్​ హీరో వెంకటేష్, యంగ్ హీరో రానా దగ్గుబాటి కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ప్రముఖ ఓటీటీ నెట్‌‌ఫ్లిక్స్​ వేదికగా మార్చి 10న విడుదలైన ఈ సిరీస్​ పలు విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అభిమానులతోపాటు సినీ ప్రముఖులు కూడా ఇలాంటి సిరీస్​ని దగ్గుబాటి హీరోల నుంచి ఊహించలేదని కామెంట్​ చేస్తున్నారు. ఈ క్రమంలో రానా అభిమానులను సోషల్​ మీడియా వేదికగా క్షమాపణ కోరారు.

ఫ్యామిలీ హీరోగా విక్టరీ వెంకటేష్​కి క్లీన్​ ఇమేజ్​ ఉంది. వెంకటేష్​ సినిమా అంటే ఇంటిల్లిపాది కూర్చుని చూడొచ్చనేది తెలుగు ప్రేక్షకుల అభిప్రాయం. అలాంటి వెంకటేష్​ నోటి నుంచి పచ్చి బూతులు వినడం అభిమానులకు అస్సలు నచ్చడం లేదు. అందుకే సోషల్​ మీడియా వేదికగా రానా నాయుడు సిరీస్​పై పెద్ద ఎత్తున ట్రోలింగ్​ జరుగుతోంది. ట్రైలర్​ విడుదలైనప్పటినుంచే మొదలైన సందేహం ఇప్పుడు బలపడింది. తెలుగులో అందులోనూ వెంకటేష్​ నటించిన సినిమాలో ఇలాంటి కంటెంట్​ ఉండటం అభిమానులకు రుచించడం లేదు.
సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ పై వ్యతిరేకత చోటు చేసుకుంది. అయినప్పటికీ ఈ వెబ్ సిరీస్ నెట్‌‌ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఈ విషయాన్ని నెట్‌‌ఫ్లిక్స్ వెల్లడించింది. అయితే రానా నాయుడు విషయంలో చోటుచేసుకున్న వ్యతిరేకతపై తాజాగా దగ్గుబాటి రానా రియాక్ట్ అయ్యారు. తమ వెబ్ సిరీస్ ని ఆదరించిన ప్రేక్షక లోకానికి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేసిన రానా.. ఈ వెబ్ సిరీస్ కుటుంబంతో కలిసి చూడొద్దు అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒంటరిగా చూడాలని ఆయన పేర్కొన్నారు

ఇప్పటికే పలువురు హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన వెంకటేష్.. రీసెంట్‌గా వరుణ్ తేజ్‌తో కలిసి F3 రూపంలో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీ మెంబర్, అన్న సురేష్ బాబు కుమారుడు దగ్గుబాటి రానాతో కలిసి మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ విమర్శల పాలవుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ హిందీతో పాటు తెలుగు, తమిళంతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇన్నాళ్లు లవ్, ఫ్యామిలీ, ఎమోషన్ చిత్రాలతో అలరించిన వెంకటేష్.. ఇలాంటి సినిమా చేస్తారని ఊహించలేదంటూ బోలెడన్ని కామెంట్లు వస్తున్నాయి. తమ సిరీస్​ చూసి హర్ట్​ అయిన వారికి సారీ అంటూ రానా సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. అయితే ఈ సిరీస్​లో బూతులను ప్రామాణికంగా తీసుకోకుండా వెంకటేష్​, రానా నటనను లెక్కలోకి తీసుకుని పరిగణించాలనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ సిరీస్​లో కంటెంట్​ అభ్యంతకరంగా ఉంటుంది కాబట్టే ప్రమోషన్స్​లోనే వెంకటేష్​, రానా ప్రేక్షకులను కుటుంబంతో కాకుండా ఒంటరిగా సిరీస్​ చూడాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే.