శత్రువులు ఎక్కువైపోయారు.. వర్మ తిట్టడానికే ఫోన్ చేస్తాడు
తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు మనోజ్ బాజ్‌పాయ్. ఆయన పేరు చెప్పగానే.. మనకు హ్యాపీ సినిమా గుర్తొస్తుంది. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో సీరియస్‌గా కనిపిస్తూనే మరోపక్క ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే తాను సినీ జీవితంలో ఎదుర్కొన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు మనోజ్.
“అప్పటివరకు చిన్న పాత్రలు చేస్తూ వస్తున్న నాకు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సత్య సినిమాలోని బీకూ మహాత్రే పాత్ర రాత్రికి రాత్రే స్టార్‌ను చేసేసింది. ఆ సినిమా తర్వాత నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. బడా బడా నిర్మాతలు సూట్‌కేస్ నిండా డబ్బు తెచ్చి మరీ కొన్ని చెత్త సినిమాల్లో నటించాలని చెప్తుండేవారు. నేను మాత్రం నో చెప్పడానికి ఎంతో కష్టపడేవాడిని. అలా చాలా మందికి నో చెప్పడంతో నాకు శత్రువులు ఎక్కువైపోయారు. ఇప్పుడు నాకు నచ్చిన పాత్రల్లోనే నటిస్తున్నాను. నాకు నచ్చకపోతే మొహం మీదే చెప్పేస్తున్నాను. ఇటీవల మిల్తే హై సప్నో మే పాట రీమిక్స్‌లో కూడా కనిపించాను. అయితే ఆ వీడియో చూసాక వర్మ నాకు ఫోన్ చేసి బూతులు తిట్టాడు. నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ ఇచ్చింది వర్మే. అతనంటే నాకెంతో అభిమానం. ఇప్పటికీ టచ్‌లో ఉంటాం. కానీ వర్మ ఫోన్ చేస్తే మాత్రం తిట్టాడనికే చేస్తాడు. నా పాట రీమిక్స్‌లో నేను నటించడంతో అలా ఎందుకు చేసావు అని కోపడ్డాడు. కానీ నేను రీమిక్స్ చేస్తున్నవారికి వద్దు అని చెప్పలేకపోయాను” అని తెలిపారు మనోజ్.