ఒక్క అవార్డుకేనా.. రాజ‌మౌళి తండ్రి అలా అనేసారేంటి!

ప‌రీక్ష‌ల్లో 100కి 90 వ‌చ్చినా… మిగ‌తా 10 మార్కులు ఎక్క‌డికిపోయాయి అని అడిగే టైప్ మ‌న ఇండియ‌న్ పేరెంట్స్. అంద‌రూ కాద‌నుకోండి. కొంద‌రు త‌ల్లిదండ్రులు ఇలాగే త‌మ పిల్ల‌ల‌తో ప్ర‌వర్తిస్తుంటారు. చూడ‌బోయే.. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్ రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ కూడా ఈ కోవ‌కే చెంద‌రుతారు అనిపిస్తోంది. ఎందుకంటారా? జ‌క్క‌న్న తెర‌కెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ సాంగ్ కేట‌గిరీలో భార‌త‌దేశానికి ఆస్కార్ తెచ్చిన‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఎంతో కృషి చేస్తే కానీ ఆ ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన అవార్డు మ‌న తెలుగు గుమ్మం తొక్క‌లేదు. అందుకు మాస్ట‌ర్‌మైండ్ రాజ‌మౌళిని భార‌త‌దేశంతో పాటు ప్రపంచమే అభినంద‌న‌ల వెల్లువ‌లో ముంచెత్తుతుంటే.. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ మాత్రం ఒక్క అవార్డుకేనా అన్న‌ట్లుగా మాట్లాడారు.

నాటు నాటు పాట‌కు ఆస్కార్ వ‌చ్చిన నేప‌థ్యంలో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. మ‌నం కేవ‌లం బెస్ట్ సాంగ్ కేట‌గిరీలోనే ఆస్కార్ సాధించాం. ఇంకా 20 కేట‌గిరీలు ఉన్నాయి. ముందు ముందు మ‌రిన్ని కేట‌గిరీల్లో ఆస్కార్ గెల‌వాలి. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్ సినిమాను తీసుకోండి. 11 కేట‌గిరీల్లో నామినేట్ అయ్యి 7 కేట‌గిరీల్లో గెలిచి ఆస్కార్లు అందుకుంది. అంటే ఆ సినిమాను ఎంత అద్భుతంగా తీసి ఉంటారో ఆలోచించండి. మ‌నం కూడా అదే స్థాయికి చేరుకోవాలి అని తెలిపారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కొంద‌రు అది కూడా క‌రెక్టేలే ఇక్క‌డితో తెలుగు చిత్ర పరిశ్ర‌మ ఆగిపోకూడ‌దు అని కామెంట్లు చేస్తుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం ఈ భార‌తీయ త‌ల్లిదండ్రులు ఎప్పుడూ ఒక‌దానితో స‌రిపెట్టుకోరు అని స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.