రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష‌

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష ప‌డింది. ఓ పరువు న‌ష్టం దావా కేసులో రాహుల్‌ను దోషిగా తేలుస్తూ సూర‌త్ కోర్టు తీర్పు వెలువ‌రించింది. 2019లో లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా.. కర్ణాట‌క‌లోని కోలార్‌లో మోదీ అనే ఇంటిపేరు ఉన్న‌వారంతా దొంగ‌లే అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దాంతో గుజ‌రాత్‌కు చెందిన ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూర‌త్ న్యాయస్థానంలో రాహుల్‌పై ప‌రువు న‌ష్టం దావా వేసారు. అయితే తాను అలా అన‌లేద‌ని రాహుల్ న్యాయ‌స్థానానికి తెలిపారు. వాదోప‌వాదాలు విన్న త‌ర్వాత కోర్టు రాహుల్‌పై ఐపీసీ సెక్ష‌న్ 499, 500 కింద కేసులు న‌మోదు చేసి దోషిగా తేల్చింది. రాహుల్ అభ్య‌ర్ధ‌న మేర‌కు వెంట‌నే బెయిలు కూడా మంజూరు చేసింది. ఈ తీర్పును పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు రాహుల్‌కు గ‌డువు ఇస్తూ అరెస్ట్‌ను 30 రోజుల పాటు నిలుపుద‌ల చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్ ట్విట‌ర్ ద్వారా స్పందించారు.  “స‌త్యం, అహింస‌పైనే నా ధ‌ర్యం ఆధార‌ప‌డి ఉంది. స‌త్యం నాకు దైవంతో స‌మానం. ఆయ‌న్ని చేరుకోవ‌డానికి కావాల్సిన సాధ‌న‌మే అహింస” అని తెలిపారు.