‘గర్వపడాలి కానీ.. ఇదేం పని’తమ్మారెడ్డిపై దర్శకేంద్రుడి ఆగ్రహం!

ఇటీవల ఓ సినిమా ప్రమోషన్స్​లో మాట్లాడుతూ ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ ప్ర‌మోష‌న్స్‌పై సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తమ్మారెడ్డి వ్యాఖ్య‌లపై నెటీజ‌న్ల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖుల నుంచి విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. తాజాగా ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు సోషల్​ మీడియా వేదికగా స్పందిస్తూ తమ్మారెడ్డిపై మండిప‌డ్డారు.

“తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరును చూసి గర్వపడాలి. అంతేకానీ 80 కోట్ల ఖ‌ర్చు అని చెప్ప‌డానికి మీ ద‌గ్గ‌ర అకౌంట్స్ ఏమైనా ఉన్నాయా..? జేమ్స్ కామెరాన్, స్టీవెన్ స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పదనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా?” అని రాఘవేంద్రరావు సూటిగా ప్రశ్నించారు. అటు మెగాబ్రదర్ నాగబాబు కూడా ఘాటుగా స్పందించారు.

ఇటీవ‌ల ‘బంగారు తల్లి’ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ బ‌డ్జెట్‌పై వ్యాఖ్య‌లు చేశారు. ఆర్ఆర్ఆర్ ను రూ.600 కోట్లు పెట్టి తీశార‌ని, ఇప్పుడు ఆస్కార్ ప్ర‌మోష‌న్స్ కోసం రూ.80 కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని ఆరోపించారు. ఆ రూ.80కోట్ల‌ను త‌న‌కు ఇస్తే ఎనిమిది సినిమాలు తీసి మీ మొఖాన కొడ‌తానంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారడంతో దీనిపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎవ్వరు ఎలా మాట్లాడినా ఎంతో సహనంగా ఉండే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ విషయంపై స్పందించడం గమనించాల్సిన విషయం. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన రాజమౌళికి మనమంతా రుణపడి ఉండాలిగానీ విమర్శించకూడదంటూ కాస్త గట్టిగానే వార్నింగ్​ ఇచ్చారు. ఇక మెగాబ్రదర్ నాగబాబు అంతకంటే ఘాటుగా స్పందించారు. డైరెక్ట్ గా ‘నీ** మొగుడు ఖర్చు పెట్టాడారా రూ.80 కోట్లు RRR కి ఆస్కార్ కోసం’ అంటూ.. ఇది ఎవరికి తగిలితే వారికి అని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బ్రాకెట్లో ఆర్ఆర్ఆర్ మీద కామెంటుకు వైసీపీ వారి భాషలో సమాధానం అని చురక అంటించారు.

ఎస్​ఎస్​ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్​తో తెరకెక్కిన సినిమా ఆర్​ఆర్​ఆర్​. ఎన్టీఆర్​, రామ్​చరణ్​ తమ నటనతో తెలుగువారినే కాదు దేశవిదేశాల అభిమానులనూ మెప్పించారు. విజువల్​ వండర్​గా బాక్స్​ఆఫీస్​ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ సినిమా ఆస్కార్​ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే భారతదేశం తరపున అఫీషియల్​గా ఆర్​ఆర్​ఆర్​ని ఆస్కార్​కు పంపకపోవడంతో రాజమౌళి స్వయంగా బరిలోకి దిగారు. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై పలు అవార్డులతో మెప్పించింది ఆర్​ఆర్​ఆర్​. మార్చి 12న జరగబోయే అకాడమీ వేడుకల్లో ఈ సినిమాకు తప్పకుండా ఆస్కార్ వస్తుందని ఆశిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆస్కార్​ వేడుకల్లో పాల్గొనేందుకు ఎన్టీఆర్​, రామ్​చరణ్​తో సహా చిత్రబృందమంతా ఇప్పటికే అమెరికా చేరుకుంది.