నెల్లూరులో పుష్ప సీన్ రిపీట్!
నెల్లూరు జిల్లాలో ఎర్ర చందనం తరలిస్తున్న స్మగ్లర్లు పుష్ప సినిమా చూసి ప్రేరణ పొందారు ఏమో కానీ.. ఆ సినిమాలోని సీన్‌ను తలపించేలా ప్రవర్తించారు. తమని పోలీసులు వెంబడిస్తున్నారని గ్రహించిన స్మగ్లర్లు అడ్డుగా వచ్చిన పోలీసుల కారునే ఢీకొట్టి ముందుకెళ్లారు. ఈ ఘటనలో పోలీసు వెహికల్‌లో ఉన్న ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా రాపూరు అటవీ ప్రాంతం నుంచి స్మగ్లర్లు కారులో ఎర్రచందనం తరలిస్తున్నట్లు అక్కడి ఎస్సైకు సమాచారం అందింది. డక్కిలి మీదుగా తిరుపతి హైవే వైపు దొంగలు వెళ్తున్నట్లు అక్కడి ఎస్సై నాగరాజుకు రాపూరు పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే స్మగ్లర్లను వెంబడించేందుకు డక్కిలి పోలీసులు బయల్దేరి వారి ఛేజింగ్ చేశారు. నేరుగా పోలీసులు వారి వాహనాన్ని తీసుకెళ్లి స్మగ్లర్ల కారుకి అడ్డుగా పెట్టారు. ఈక్రమంలో స్మగ్లర్లు తమ కారుతో పోలీసు వాహనంపైకి వేగంగా దూసుకెళ్లి ఢీకొట్టారు. అనంతరం కారు ఆగిపోవడంతో అక్కడి నుంచి దుండగులు పరారయ్యారు. స్మగ్లర్ల కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో డక్కిలి ఎస్సైకు ముఖంపై తీవ్ర గాయాలు కాగా.. అతన్ని నెల్లూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.