పంజాబ్‌లో హైఅలర్ట్.. ఇంటర్నెట్ బంద్
పరారీలో ఉన్న ఖలిస్థాన్ వేర్పాటు వాది అమృత్ పాల్ సింగ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు పంజాబ్ పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పలు చోట్ల ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు. అమృత్ పాల్‌ను పట్టుకునేందుకు చర్యలు మొదలు పెట్టిన వెంటనే అక్కడ ఇంటర్నెట్‌ను ఆపేశారు. అయితే…ఇప్పుడు ఈ ఆంక్షల్ని పొడిగించారు. రేపటి(మార్చి 20) వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మొబైల్ ఇంటర్నెట్‌తో పాటు SMS సర్వీస్‌లపైనా ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. నిన్న పోలీసులకు చిక్కినట్లే చిక్కి అమృత్ పాల్ సింగ్ తప్పించుకున్నాడు. అనుచరుల సాయంతో బైక్‌పై పరారయ్యాడు. దాంతో పోలీసులు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అసలు కథ ఇది
ఇటీవల పంజాబ్ పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో భాగంగా.. పంజాబ్‌కు చెందిన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తుఫాన్ సింగ్‌ను అరెస్ట్ చేసారు. ఇతను అమృత్ పాల్ సింగ్‌కు సన్నిహితుడు. తన స్నేహితుడిని ఎలాగైనా విడిపించాలన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 24న అమృత్‌సర్ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్ స్టేషన్‌పై దాడి చేయాలని ప్లాన్ వేసాడు. ఈ నేపథ్యంలో కొందరు పంజాబీలను నియమించుకుని వారిని రెచ్చగొట్టి దాడికి పాల్పడేలా చేసాడు. సిక్కుల పవిత్ర గ్రంథాన్ని అడ్డంపెట్టుకుని నిరసనకారులు పెద్ద గొడవ చేయడంతో మరోదారి లేక పోలీసులు లవ్‌ప్రీత్‌ను విడుదల చేసారు. అల్లర్లు చేయాలని ప్రజలను రెచ్చగొట్టిన నేపథ్యంలో పోలీసులు అమృత్‌పాల్‌ను అరెస్ట్ చేయాలని అనుకున్నారు. అతను శనివారం జలంధర్ ప్రాంతానికి వస్తున్నట్లు సమాచారం అందడంతో అరెస్ట్ చేయాలని అనుకున్నారు. కానీ అమృత్‌పాల్ చిక్కినట్లే చిక్కి అనుచరుల సాయంతో బైక్‌పై పరారయ్యాడు. దాంతో పంజాబ్‌లో హైఅలర్ట్ నెలకొంది.