ముద్దు పెట్టి.. డబ్బులు విసిరి.. ప్రీతీ జింతాకు చేదు అనుభవం
ప్రముఖ నటి ప్రీతి జింతాకు చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ వల్ల తన బిడ్డకు, ఓ వికలాండగుడి వల్ల తనకు ఎదురైన అనుభవాల గురించి ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ భయాందోళనకు గురయ్యానని వాపోయారు. అసలు ఏం జరిగిందంటే.. ప్రీతి జింతా కూతురు జియాను దగ్గర్లోని పార్క్‌కు తీసుకువెళ్లారట. పాపతో పాటు ఆయాను కూడా వెంటబెట్టుకెళ్లారు. అయితే పాప చాలా క్యూట్‌గా ఉందంటూ పార్క్‌లోని ఓ మహిళ ఫొటోలు తీస్తుండగా వద్దు అని ప్రీతి వారించారట. ఆమె వెళుతున్నట్లే వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి పాప ఎత్తుకుని పెదాలపై ముద్దు పెట్టి వెళ్లిపోయిందట. దాంతో ప్రీతి షాకయ్యారు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆమె బయటికి వెళ్తుండగా ఓ వికలాంగుడు కారు వద్దకు వచ్చి డబ్బులు అడిగాడట. ప్రీతి ఎప్పుడు కనిపించినా డబ్బులు కావాలని టార్చర్ పెడుతుండేవాట. ప్రీతి కూడా జాలి పడి వీలైనప్పుడు డబ్బు ఇచ్చి సాయం చేస్తుంటారట. అయితే మొన్న అతను అడిగినప్పుడు మాత్రం తన వద్ద క్రెడిట్ కార్డు మాత్రమే ఉండటంతో డబ్బులు ఇవ్వలేకపోయారట. అయితే ప్రీతి పక్కన ఉన్న మహిళ కొంత డబ్బు ఇచ్చిందట. అతను ఆ డబ్బును తీసుకోకపోగా వారిపై విసిరేసి నోటికొచ్చినట్లు తిట్టాడట. అంతేకాదు చక్రాల కుర్చీలో నుంచే కారును వెంబడించి హేళన చేసాడంటూ ప్రీతి వాపోయారు.
“నేను సెలబ్రిటీని అవ్వడానికి ముందు ఓ మనిషిని, అమ్మను. మాలాంటి వారికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఫొటోగ్రాఫర్లు మాపై నవ్వుతారు. ఇలాంటివాటిని ఖండించేందుకు కూడా ప్రయత్నించరు. నా కూతురిని ఒక మహిళ ఎత్తుకుని ముద్దు పెట్టినప్పుడు నేను సెలబ్రిటీని కాకపోయి ఉంటే ఏం చేసేదాన్నో నాకే తెలీదు. కానీ నేను ఏం చేసినా తప్పు నాదే అంటారు కాబట్టి ఊరుకున్నాను. దయచేసి నా పిల్లలకు దూరంగా ఉండండి. నన్ను ఎన్ని ఫోటోలైనా తీసుకోండి, ఎలాంటి కామెంట్లైనా పెట్టుకోండి. నేనేమీ అనుకోను. ఆ వికలాంగుడు నా కారును వెంబడిస్తుంటే అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు కనీసం అతన్ని ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. పైగా నవ్వుతూ వీడియోలు తీస్తూ ఉండిపోయారు. నేను పొరపాటున అరిచి గొడవ చేసి ఉంటే మాత్రం సెలబ్రిటీనని పొగరని, బాలీవుడ్ అంతా ఇంతేనని నెగిటివిటీ వ్యాపింపచేస్తారు. దయచేసి మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించి తగిన గౌరవం, ప్రైవసీ ఇస్తారని ఆశిస్తున్నాను” అని తెలిపారు ప్రీతి.