నా కూతురిని చంపాలనుకున్నారు: ప్రీతి తండ్రి
వరంగల్ కేఎంసీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ అంశంపై తాజాగా ప్రీతి తండ్రి నరేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురుది ఆత్మహత్యాయత్నం కాదని, హత్య చేయాలని చూశారని అన్నారు నరేందర్. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకునేంత పిరికిది కాదని, తన కూతురిపై హత్యాయత్నం జరిగి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ప్రీతి ఆడియోలను వింటుంటే ఆమెను ఎంతగా వేధించారో అర్థమవుతుందని, ఇది ముమ్మాటికీ హత్యేనని నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమతో ప్రీతి మాట్లాడిన తర్వాత హత్యాయత్నం జరిగి ఉండొచ్చని తండ్రి నరేందర్ తెలిపారు. తనతో ఫోన్ కాల్‌లో మాట్లాడే సమయంలో కూడా భయంతో ప్రీతి ఉందని, తనను ఏదో చేస్తారనే అనుమానం వ్యక్తం చేసినట్లు చెప్పారు. సైఫ్ వేధింపులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, చాలామందిని ఇలాగే వేధిస్తున్నట్లు తనతో చెప్పిందని, తామెంత ధైర్యం చెప్పినా ఫలితం లేకపోయిందని నరేందర్ వాపోయారు.
ప్రీతి తన తల్లితో మాట్లాడిన ఆడియో కాల్ బయటకు లీక్ అయిన నేపథ్యంలో.. తండ్రి నరేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హత్యాయత్నం అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు సైఫ్‌ను పోలీసులు రిమాండ్‌లోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీంతో విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశముంది. వేధింపుల గురించి సైఫ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటపడతాయేది చర్చనీయాంశంగా మారింది.
సైఫ్ వేధింపుల గురించి తన తల్లితో ప్రీతి మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది. ఇందులో కాలేజీలో చదువుకోవాలంటేనే తనకు భయమేస్తోందని, సైఫ్ వేధింపులు ఆగడం లేదని ప్రీతి తెలిపింది. సైఫ్ బ్యాచ్ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, తాను భరించలేకపోతున్నట్లు తల్లికి వివరించింది. నాన్న పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సైఫ్ ఏమీ చేయలేడని, చదువుపై దృష్టి పెట్టాలని ప్రీతికి తల్లి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ సీనియర్ల వేధింపుల నుండి బయటపడేందుకు ఏ దారీ లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసింది ప్రీతి. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై ప్రీతికి వైద్యం అందిస్తున్నా ఆమె ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది.
‘సైఫ్ తను వేధిస్తున్నాడని స్నేహితులకు చేసిన ఛాట్‌లో ప్రీతి పేర్కొంది. హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని, గ్రూపులో పోస్ట్ చేసి అవమానపరుస్తున్నాడని చెప్పింది. ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకురావాలని ప్రీతి ఫ్రెండ్స్‌కు తెలిపింది. డిసెంబర్ 6 సహా మూడుసార్లు చిన్న ఘటనలు జరిగాయి. సీనియర్లను జూనియర్ల సార్ అనాలనే విధానం ఇక్కడ పాటిస్తున్నారు. ఇది బాసిజం తరహాలో ఉందని ఆమె భావించింది. ఈ నెల 18న వాట్సాప్ గ్రూప్‌లో ఛాటింగ్ చేశారు. నన్ను ఉద్దేశించి ఛాట్ చేయడం సరికాదని సైఫ్‌కు ప్రీతి మెసేజ్ పెట్టింది. ప్రీతి తండ్రి నరేందర్‌తో అన్ని విషయాలు మాట్లాడాం. ఏసీపీ, మట్వాడా ఎస్‌ఐ దృష్టికి ఇదే విషయాన్ని ప్రీతి తండ్రి తీసుకెళ్లారు. ఈ నెల 21న ప్రిన్సిపాల్‌ను కలిసి సీనియర్‌గా ప్రీతికి సలహాలు ఇస్తున్నాని సైఫ్ చెప్పాడు. కానీ అమ్మాయినే టార్గెట్ చేసుకున్నాడని సైఫ్ ఛాట్ ద్వారా తెలిసింది’ అని సీపీ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు.