ఆత్మహత్యకు ముందు తల్లికి ఫోన్ చేసిన ప్రీతి.. ఆడియో లీక్!
సీనియర్ల వేధింపులు తాళలేక వరంగల్‌కు చెందిన ఎంజీఎం పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై ప్రీతికి వైద్యం అందుతున్నా పరిస్థితి ఇంకా విషమంగానే ఉందంటున్నారు వైద్యులు. అయితే ఈ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఆత్మహత్యా ప్రయత్నానికి ముందు ప్రీతి తన తల్లితో మాట్లాడిన ఆడియో తాజాగా బయటకు వచ్చింది. తల్లికి ఫోన్ చేసి ప్రీతి తన బాధను పంచుకుంది.
‘సైఫ్ నాతో పాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడు. సీనియర్లంతా ఒకటయ్యారు. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా ఏం లాభం లేకుండా పోయింది. సైఫ్ వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నేను అతడిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లంతా ఒక్కటై నన్ను దూరం పెడతారు. ఏదైనా ఉంటే తన దగ్గరికి రావాలి కానీ ప్రిన్సిపల్‌కి ఎందుకు ఫిర్యాదు చేశారని హెచ్‌వోడీ నాగార్జునరెడ్డి నన్ను కోప్పడ్డారు’ అని తల్లితో ప్రీతి చెప్పింది. సైఫ్‌తో తాను మాట్లాడతానని.. ఇబ్బంది లేకుండా చేస్తానని తల్లి భరోసా ఇచ్చింది. అయినా అన్నిదారులూ మూసుకుపోవడంతోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.
నాలుగు నెలలుగా ప్రీతిని సీనియర్ విద్యార్థి డాక్టర్ సైఫ్ వేధించినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. వాట్సప్ గ్రూపులో ప్రీతిని అవమానించేలా పోస్టులు పెట్టాడని, అలా మేసేజ్‌లు పెట్టవద్దని ప్రీతి చాలా రోజులు వేడుకుందన్నారు. సైఫ్ పెట్టిన మేసేజ్‌లను తాము పరిశీలించామని, ఇతర విద్యార్థులతో కలిసి ప్రీతిని వాట్సప్ గ్రూపుల్లో టార్గెట్ చేసినట్లు గుర్తించామని తెలిపారు. సైఫ్ వేధించినట్లుగా ఆధారాలు లభించాయని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు.