ఒకటి కాదు.. 5 ప్రశ్నాపత్రాలు లీక్‌ చేసిన ప్రవీణ్‌!

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అంశంపై ఇప్పటికే సిట్‌ అధికారులు సీరియస్‌గా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక వివరాలు రాబట్టినట్లు సిట్‌ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఏ1 ప్రవీణ్‌ ఫోన్‌తోపాట, పరీక్ష పత్రాలు లీక్‌ చేసేందుకు వినియోగించిన పెన్‌డ్రైవ్‌ను సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తం అయిదు పరీక్ష పేపర్లు ప్రవీణ్‌ వద్ద ఉన్నట్లు తెలియవస్తోంది. ఇందులో ఏఈ, టీపీబీఓ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, ఏఎంవీఐ ప్రశ్న పత్రాలు ప్రవీణ్‌ పెన్ డ్రైవ్ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రవీణ్ పరీక్షకు స్వాడ్‌గా వెళ్ళి కీ కూడా అందించినట్లు గుర్తించారు. వీటితోపాటు మరిన్ని ప్రశ్నపత్రాలు ఇస్తానని నిందితుడు ప్రవీణ్ రేణుకకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక పేపర్ లీక్ వ్యవహారాలు ఒక్కొక్కటి బయటపడటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే అధికారులు కానీ అటు టీఎస్‌పీఎస్సీ అధికారులు కానీ…. ఇప్పటి వరకు పేపర్ల లీక్‌ అంశంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కేసు దర్యాప్తులో ఉన్నందున ఎలాంటి వివరాలు వెల్లడించినా నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంటుందని… దీంతోపాటు నిందుతులను వివరాలు సేకరించడం సాధ్యం కాదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 9 మంది నిందితులను అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. నిందితుడు ప్రవీణ్‌ ఏఈ ప్రశ్నపత్రం రేణుకకు విక్రయించగా.. మిగిలిన ప్రశ్నపత్రాలు ఎవరికి విక్రయించాడనే దానిపై సిట్‌ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

టీసీపీఎస్‌సీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు..
టీసీపీఎస్‌సీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పేపర్ల లీక్‌ అంశం రాష్ట్రం అంతా పెద్ద దుమారం రేపుతోంది. దీంతో నిరుద్యోగుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అసలు ఎప్పటి నుంచి పరీక్ష పత్రాలు లీకవుతున్నాయి అన్న అంశంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో ఎందరో ప్రతిభావంతులు ప్రభుత్వ ఉద్యోగాలకు దూరమవుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల కిందట కొన్ని సంఘాలు టీసీపీఎస్‌సీ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడి బోర్డును సైతం విరగ్గొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.