ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీలో ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1గంటకు సుమారు 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోగా.. నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఆయన కుమారుడి వివాహం ఇవాళే ఉండటంతో కాస్త ఆలస్యంగా అసెంబ్లీకి వచ్చారు. ఇక ఆయన ఓటుతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అప్పల నాయుడు కోసం వైసీపీ ప్రభుత్వం ఏకంగా ప్రత్యేక చాపర్‌ను విశాఖపట్నానికి పంపింది. గన్నవరం వరకు చాపర్‌లో వచ్చిన ఆయన అనంతరం అసెంబ్లీకి నేరుగా చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే వెలగపూడిలోని అసెంబ్లీ మొదటి అంతస్థులో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలుకాగా.. ముందుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చి ఓటు వేశారు. చంద్రబాబుతోపాటు నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు వీల్ చెయిర్‌లో వచ్చి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇవాళ రాత్రికి ఫలితాలు విడుదల..
ఎన్నికల అధికారులు ముందుగా ప్రకటించినట్లు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. దానికి ముందే కౌంటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. కేవలం 175 మంది అభ్యర్థులే కావడంతో రెండు గంటల్లో ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫలితాలపై వైసీపీ, టీడీపీ ఎదురుచూస్తున్నాయి. వైసీపీ తమ తరపున నిలబెట్టిన ఏడుగురు సభ్యులు గెలుపొందాలని చూస్తుంటే… టీడీపీ మాత్రం ఒక్క సీటు కచ్చితంగా గెలవాలని భావిస్తోంది. మరి ఫలితం మాత్రం బ్యాలెట్ బాక్సుల్లో ఇప్పటికైతే భద్రంగా ఉంది. మరికొద్ది సేపట్లే ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఉంది అన్నది తేలనుంది.