హైద‌రాబాద్‌లో మోదీ…. తెలంగాణలో హాట్‌హాట్‌గా రాజకీయాలు

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్‌తోపాటు ఆ పార్టీ నేతలు ఇటీవల ప్రధాని లక్ష్యంగా అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కూడా… టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ, ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత పేరు రావడం, పదో తరగతి పరీక్ష పత్రాల లీక్ లు జరగడం, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు కావడం వంటి అంశాలపై ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రస్తావిస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

బీజేపీ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌…
తెలంగాణలో ఈ ఏడాది చివరికి అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ, ఢిల్లీ లిక్కర్‌ స్కాం అంశాలపై బీజేపీ పెద్దఎత్తున ప్రచారం చేసి బీఆర్‌ఎస్‌ సర్కారును, కేసీఆర్‌ కుటుంబాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. బీఆర్‌ఎస్‌ కూడా దీటుగా స్పందించి ప్రత్యారోపణలకు దిగింది. పదో తరగతి పేపర్ల లీక్‌ కేసులో కుట్ర బీజేపీదేనంటూ.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేయండంతో మరింత వేడి రాచుకుంది. తాజాగా మోదీ పర్యటన సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణ అంశాన్ని బీఆర్‌ఎస్‌ మళ్లీ తెరపైకి తెచ్చి అటు కేంద్రాన్ని, ఇటు బీజేపీని ఇబ్బంది పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతోపాటు మోదీకి వ్యతిరేకంగా పలుచోట్ల హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

రూ.11 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వేళ.. ఇవాళ ఆ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.11 వేల కోట్ల పైచిలుకు విలువైన పలు కార్యక్రమాలను మోదీ శ్రీకారం చుట్టనున్నారు. దీంతోపాటు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ఎయిర్‌పోర్టులకు దీటు అభివృద్ది చేయడమే బీజేపీ లక్ష్యం అని చెప్పుకొస్తోంది. ఇక అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించడంతోపాటు.. ఇవాళ జరిగే బహినంగ సభలో రాజకీయపరమైన అంశాలపై మాట్లాడతారా, లేదా అన్న చర్చ సాగుతోంది. గత ఏడాదిన్నర కాలంలో పలుమార్లు రాష్ట్రానికి వచ్చిన మోదీ.. కొన్నిసార్లు కేసీఆర్‌ను, రాష్ట్ర సర్కార్‌ను ఉద్దేశించి నేరుగా.. మరికొన్ని సార్లు పరోక్షంగా విమర్శలు సంధించారు. మరి ఇప్పుడు బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై, సీఎం కేసీఆర్‌ వ్యవహారశైలిపై ఘాటైన విమర్శలు చేస్తారా, లేక గతంలో తరహాలో పరోక్ష విమర్శలు చేస్తారా? బండి సంజయ్‌ అరెస్టు వంటి అంశాలను ప్రస్తావించి తప్పుపడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

కొన్నినెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. మోదీ సభలో తాజా రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని రాష్ట్ర సర్కారు, బీఆర్‌ఎస్‌ టార్గెట్‌ చేయడం వంటివి చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలి కాలంలో టీఎస్‌పీఎస్సీ, టెన్త్‌ పేపర్ల లీకేజీ, సంజయ్‌ అరెస్ట్, మళ్లీ సింగరేణి ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తేవడం, ఢిల్లీ లిక్కర్‌స్కాంలో కవితను ఈడీ విచారించడం వంటి అంశాలను ప్రధాని మోదీ పరోక్షంగానైనా ప్రస్తావించి… తద్వారా బీఆర్‌ఎస్‌ పెద్దలకు, రాష్ట్ర బీజేపీకి తగిన సంకేతాలు ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుటుంబ పార్టీలు, రాజకీయాలు, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలను ప్రస్తావిస్తూ పరోక్షంగా విమర్శించే అవకాశం ఉందని కొందరు నేతలు చెబుతున్నారు.

ప్రధాని మోదీతో.. ఈ సారి కూడా కేసీఆర్‌ కలవరు..
దాదాపు ఏడాదిన్నర కాలంలో వివిధ అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మోదీ నాలుగుసార్లు రాష్ట్రానికి రాగా.. సీఎం కేసీఆర్‌ ఒక్కసారి కూడా స్వాగతం పలకడానికి వెళ్లలేదు. ఆయన కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. ఇప్పుడు ఐదోసారి ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారు. ప్రోటోకాల్‌ ప్రకారం సీఎంకు ఆహ్వానం పంపారు. బహిరంగ సభలో సీఎం ప్రసంగానికి ఏడు నిమిషాల సమయం కూడా కేటాయించారు. కానీ ఈసారి కూడా ప్రధాని కార్యక్రమాలు, సభలో కేసీఆర్‌ పాల్గొనడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌ను పంపిస్తున్నట్లు తెలిపారు. ఇక దీపై స్పందించిన బండి సంజయ్‌.. ప్రధానిని ఆహ్వానించేందుకు కేసీఆర్‌ వచ్చే సన్మానించి పంపుతామని.. ఆ గౌరవం దక్కించుకోవాలని అన్నారు.

ప్రధాని టూర్‌ ఇలా ఉండనుంది.
పలు రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, ఎయిమ్స్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం ప్రధాని శనివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వెళతారు. అక్కడి కార్యక్రమాల తర్వాత పరేడ్‌గ్రౌండ్స్‌ సభలో పాల్గొంటారు.

⇒ ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేటకు..

⇒ 11.45కు రోడ్డుమార్గాన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు..

⇒ 11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్‌ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు.

⇒ 11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభిస్తారు.

⇒ మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.

⇒ 12.20 నుంచి 12.30 దాకా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు

⇒ 12.30 నుంచి 12.37 దాకా సీఎం కేసీఆర్‌ ప్రసంగం…

⇒ 12.37 నుంచి 12.50 మధ్య రిమోట్‌ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాల ఆవిష్కరణ. షార్ట్‌ వీడియోల ప్రదర్శన.

⇒ 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం

⇒ 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం.