దారుణం.. ప్రిన్సిపల్‌కి నిప్పంటించిన విద్యార్థి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌పై పూర్వ విద్యార్థి పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో ప్రిన్సిపల్‌ 70 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో స్పందించిన ఇండోర్‌ రూరల్‌ ఎస్పీ భగవత్‌ సింగ్‌ వర్డే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి ఎస్పీ, కళాశాల యాజమాన్యం తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని బీఎమ్‌ ఫార్మసీ కళాశాలలో ప్రిన్సిపల్‌గా విముక్త శర్మ(54) పనిచేస్తున్నారు. ఇక ఇదే కళాశాలలో గత ఏడాది వరకు అశుతోష్ శ్రీవాస్తవ (24) అదే కళాశాలలో చదువుకున్నాడు. ఈక్రమంలో ఇతనికీ ప్రిన్సిపల్‌కు మధ్య కొన్ని వివాదాలు నెలకొన్నాయి. శ్రీవాస్తవ పద్దతి నచ్చని ప్రిన్సిపల్‌ శర్మ పలుమార్లు కళాశాల యాజమాన్యానికి, స్థానిక పోలీసులుకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా వాటిని పట్టించుకోని శ్రీవాస్తవ తన నేరప్రవుర్తిని విడనాడలేదు. గత ఏడాది జరిగిన ఏడో సెమిస్టర్‌లో శ్రీవాస్తవ ఫెయిల్యడు. తాను ఉత్తీర్ణత సాధించకపోవడానికి ప్రిన్సిపల్‌ కారణమని అతను గొడవపడ్డాడు. ఈక్రమంలో ప్రిన్సిపల్‌ శర్మపై పదునైన ఆయుధంతో దాడికి చేశాడు. దీంతో కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్‌ శర్మ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని అరెస్టు చేశారు.

బెయిల్‌పై బయటకు వచ్చి.. పథకాన్ని అమలు చేసి…
ప్రిన్సిపల్‌పై దాడి ఘటనలో జైలుకు వెళ్లిన శ్రీవాస్తవ కొన్ని రోజుల కిందట బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఒకవైపు ఫెయిలవడం.. మరోవైపు జైలుకు వెళ్లిరావడంతో ప్రిన్సిపల్‌పై అతను మరింత కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా తన పగతీర్చుకోవాలని భావించిన శ్రీవాస్తవ పెట్రోల్‌ తీసుకుని ఇండోర్‌లోని సిమ్రోల్‌ ప్రాంతంలో ఉన్న ప్రిన్సిపల్‌ శర్మ ఇంటి వద్దకు వెళ్లి ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే దాదాపు 70 శాతం శరీరం కాలిపోయింది. హుటాహుటిన ప్రిన్సిపల్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య చికిత్స ప్రారంభించారు. సుమారు వారంపాటు మృత్యువుతో పోరాడిని ఆమె చివరికి చనిపోయినట్లు ఎస్పీ భగవత్‌ సింగ్‌ వర్డే తెలిపారు. శ్రీవాస్తవకు కూడా 20 శాతం గాయాలయ్యాయని పేర్కొన్నారు.

ఘటనపై కలెక్టర్‌ ఇళయరాజా సీరియస్…
ప్రిన్సిపల్‌ మృతి చెందిన ఘటనపై ఇండోర్ కలెక్టర్ టి.ఇళయరాజా సీరియస్‌ అయ్యారు. వెంటనే శ్రీవాస్తవపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద కఠినచర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినట్లు ఎస్పీ విర్దే తెలిపారు. ఇక ఘటనకు సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రిన్సిపల్‌ శర్మ నుంచి పలు వివరాలు స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు. మరోవైపు నిందితుడు శ్రీవాస్తవను కూడా పోలీసులు విచారించగా.. తాను గత ఏడాది అన్నీ పరీక్షలు ఉత్తీర్ణత సాధించానని.. అయినప్పటికీ మార్కుల లిస్టు, సర్టిఫికేట్లు ఇవ్వకుండా కళాశాల ప్రిన్సిపల్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నందునే ఇలా చేశానని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన కళాశాల యాజమాన్యం శ్రీవాస్తవ చెప్తున్నదంతా అవాస్తమని అతను సర్టిఫికేట్ల కోసం కోరిందే లేదని,, ఆ విషయమై తమను ఎప్పుడూ సంప్రదించలేదన్నారు. పలుమార్లు తామే సర్టిఫికేట్లు తీసుకెళ్లాలని శ్రీవాస్తవకు చెప్పామని అయినా అతను రాలేదని కళాశాల సిబ్బంది చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇండోర్‌లోని అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ సంజీవ్ తివారీని సస్పెండ్ చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలియజేసింది.