అవినీతిపై పోరాడేందుకు ప్రజలు సహకరించాలి – ప్రధాని మోదీ
తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంతోపాటు, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించేందుకు వచ్చిన మోదీ.. రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ పాలనపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఎక్కడా ఎవరి పేర్లను ప్రస్తావించకుండా.. తెలంగాణలో అవినీతి పరుల పాలన పోయేందుకు ప్రజలు సహకరించాలని, మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తొలుత.. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికపై నుంచి పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ.. రిమోట్ ద్వారా శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలోని అయిదు జాతీయ రహదారులకు, బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులను ఆయన ప్రారంభించారు. మొత్తం సుమారు రూ.11,355 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను కూడా ఆయన ప్రారంభించారు.
తెలుగులో ప్రసంగం..
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ప్రియమైన సోదర, సోదరీమణులరా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. దీంతో సభలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈలలు, గోలలతో సభా స్థలి దద్దరిల్లింది. అనంతరం తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. ‘రాష్ట్రంలో కుటుంబం, అవినీతి పాలన నడస్తుందని.. ప్రతి ప్రాజెక్టులో అవినీతి వల్ల ఆలస్యం అవుతోంది. తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని’ మోదీ మండిపడ్డారు. కుటుంబ పాలనకు విముక్తి కలగాలని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని.. అదే తన బాధ, ఆవేదన అని మోదీ అన్నారు. తెలంగాణ ఏర్పాటులో ప్రతీ ఒక్కరూ భాగస్వాములయ్యారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి తిరుమల వెంకన్న వరకు ట్రైన్ వేశామని మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా చేయాలన్నది కేంద్రానికి తెలుసని.. అందుకే రూ.11వేల కోట్లకుపైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామన్నారు. ఏపీ-తెలంగాణను కలుపుతూ మరో వందేభారత్ రైలును ప్రారంభించాం. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ నినాదంతో మందుకెళ్తున్నామన్నారు. హైదరాబాద్‌లో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరించామన్నారు. ఎంఎంటీఎస్ విస్తరణ కోసం రూ.600 కోట్లు కేటాయించామని.. రైల్వేల్లో తెలంగాణకు భారీగా నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజం..
తాము ప్రజల కోసం పని చేస్తుంటే.. కొందరు మాత్రం అవినీతి చేసేందుకు పనులు చేస్తున్నారని రాష్ట్ర పాలనపై ప్రధాని మోదీ విమర్శలు, ఆరోపణలు చేశారు. ప్రతి ప్రాజెక్టులో కుటుంబ సభ్యుల ఆసక్తి మాత్రమే ఉందని.. ప్రజల ప్రయోజనాలు చూడట్లేదన్నారు. అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా.. వద్దా అంటూ ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలిగించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోందని.. తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతి పెరిగిపోయిందన్నారు. ప్రతీ వ్యవస్థలో పెత్తనం చలాయించాలని వారి ప్రయత్నం జరుగుతోంది. కొందురు వారి స్వలాభం మాత్రమే చూసుకుంటున్నారు. అవినీతపరులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే. అవినీతిని ముక్తకంఠంతో ఖండించాలి. ఎంతపెద్దవారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రధాని అన్నారు. ఈ తొమ్మిదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ముందంజలో ఉన్నాం. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా భారత్‌లో స్థిరంగా అభివృద్ధి జరుగుతోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాం అని ప్రధాని తెలిపారు.