థ్యాంక్యూ దేవుడా..!
ప్రముఖ కోలీవుడ్ నటుడు, దర్శకుడు సముద్ర ఖని డైరెక్షన్లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘వినోదయ సిత్తం’ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తయిందంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు దర్శకుడు సముద్రఖని. అంతేకాదు సినిమా విడుదల తేదీని ప్రకటించేసి అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచారు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు పవన్ కల్యాణ్. రాజకీయాల్లోనూ రాణిస్తున్న పవన్ రానున్న ఎలక్షన్‌ల దృష్ట్యా ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం పవన్ చేతిలో గు ప్రాజెక్ట్‌లున్నాయి. ‘హరిహర వీరమల్లు’తో పాటు ‘వినోదయ సిత్తం’ రీమేక్, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘ఓజీ’ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా తాజాగా వినోదయ సిత్తం రీమేక్ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవలే పవన్.. హరిహర వీరమల్లుకు కాస్త బ్రేక్ ఇచ్చి వినోదయ సిత్తం రీమేక్ పూర్తి చేశారు పవన్‌కల్యాణ్. సాయిధరమ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక, ఈ సినిమాలో పవన్ దాదాపు 40 నిమిషాలు కనిపించనున్నాడట. కాగా తాజాగా పవన్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయిదంటూ.. ‘ థ్యాంక్యూ గాడ్, పవన్ కళ్యాణ్ సార్‌కు సంబంధించిన షూటింగ్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశాము. జూలై 28న థియేటర్‌లో కలుద్దాం’దర్శకుడు సముద్రఖని పవన్‌తో కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఇంత త్వరగా షూటింగ్ పూర్తవడంతో అటు పవన్ ఫ్యాన్స్ ఇటు ప్రేక్షకులు షాక్‌కు గురవుతున్నారు. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ మానవ రూపంలో ఉన్న దేవుడి పాత్రలో కనిపిస్తారు. ప్రమాదంలో మరణించిన ఓ యువకుడికి దేవుడు పునర్జన్మ ప్రసాదిస్తే అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ సినిమా కథ. యువకుడిగా సాయిధరమ్ తేజ్ నటించనున్నాడు. ఇప్పటికే గోపాల గోపాల సినిమాలో పవన్ దేవుడిగా కనిపించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలో పవన్ గెటప్ ఎలా ఉంటుందో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పేరుకు తమిళ రీమేక్ అయినా.. త్రివిక్రమ్ తెలుగు నెటీవిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ కోసం పవన్ అభిమానులతోపాటు తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.