నేడు అసెంబ్లీలో.. రేపు వీధుల్లో: పవన్‌ కల్యాణ్‌ ఫైర్‌

అసెంబ్లీలో టీడీపీ-వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఇవాళ జరిగిన జరిగిన దాడులకు సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన దాడులు.. రేపు వీధుల వరకు వస్తాయని పవన్‌ పేర్కొన్నారు. చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయకుడిగా సీఎంపైనా ఉందని పవన్‌ అన్నారు. ఈ సందర్బంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు లేకుండా.. దాడులు చేసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు.

జీవో నంబర్‌ 1పై చర్చకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనుమతించి ఉండాల్సిందని పవన్‌ పేర్కొన్నారు. చట్ట సభలలో అర్థవంతమైన చర్చలు చేసి ప్రజలకు మేలు చేస్తారని అందరం ఆశిస్తున్నామన్నారు. పరిపాలన విధానాల్లో ప్రజా ప్రయోజనాలకి విరుద్ధంగా ఉన్నవాటిపై చర్చ చేయాలని.. చర్చ కోసం ప్రతిపక్షాలు పట్టుబడితే దాడులు చేయడం భావ్యం కాదన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ దాడులు చట్ట సభల నుంచి వీధుల్లోకి వస్తాయన్నారు. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయన్నారు. చట్టసభల గౌరవాన్ని, హుందాతనాన్ని పరిరక్షించాలని.. ఇలాంటి ఘటనలతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నారు. తెదేపా ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని ఆయన పేర్కొన్నారు.