పవన్‌కి సీఎం అయ్యే సత్తా ఉంది: నటి లయ
ఒకప్పుడు కేవలం గ్లామర్‌గా కనిపిస్తేనే హీరోయిన్లకు విచ్చలవిడిగా ఛాన్సులు వచ్చేవి. చీరకట్టులో హీరోయిన్లు సినిమాలు చేయడం అంటే చాలా మందికి ప్రేక్షకులకు నచ్చేది కాదు. కానీ సినిమా మొత్తం కూడా చీరకట్టుతోనే అబ్బాయిల మనసులను కనికట్టు చేసి సిల్వర్ స్క్రీన్ మీద ఒక వెలుగు వెలిగిన నటీమణుల్లో లయ ఒకరు. దివంగత నటి సౌందర్య తర్వాత అంతటి అందంతో టాప్ హీరోయిన్లలో ఒకరుగా నిలిచారు. కొంతకాలం సినిమా రంగాన్ని ఏలి ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడిన లయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను బయటపెట్టారు.
“కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయా. కెరీర్‌ని వదులుకోవాల్సి వచ్చినందుకు చాలా బాధపడ్డాను కానీ కొన్నిసార్లు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పదు. అన్నీ కావాలంటే దొరకవు కదా లైఫ్‌లో. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ గురించి నేను అసలు ఆలోచించలేదు. మా వారితో పాటు నా స్నేహితులు కూడా చాలా సార్లు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయ్యి, నీకోసం కాకపోయినా నీ ఫ్యాన్స్ కోసం అయినా మళ్లీ నటించాలని అంటుండేవారు. సినిమాల సంగతి పక్కనపెడితే కనీసం యూట్యూబ్ ఛానెల్ పెడితే బాగుంటుంది అనుకున్నా. కానీ నాకు ప్రైవేట్ స్పేస్ ఉండదేమోనని వద్దు అనిపించింది. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసి రీల్స్ చేయడం, ఫ్యాన్స్ కోసం ఏవైనా పోస్ట్‌లు పెట్టడంలాంటివి చేస్తున్నాను. నా రీల్స్ అన్నీ మావారే తీస్తుంటారు. అలా రీల్స్ చేస్తున్నప్పుడే నాకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో జగపతిబాబుకి భార్య పాత్రలో నటించే అవకాశం వచ్చింది.
కానీ నాకు ఎందుకో అది చిత్ర పాత్ర ఏమో పెద్దగా ఇంపార్టెన్స్ లేదేమో అనిపించి నో చెప్పా. కానీ సినిమా చూసాక అర్థమైంది అది ఎంత పవర్ఫుల్ క్యారెక్టరో. జీవితంలో అన్ని సార్లు మంచి నిర్ణయాలే తీసుకోలేం కదా.”
పవన్‌కి సీఎం అయ్యే సత్తా ఉంది
“నా పెళ్లికి పిలవడానికి పవన్ కల్యాణ్ గారి ఇంటికి వెళ్లాను. ఆయన వెయిట్ చేయించకుండా వెంటనే లోపలికి రమ్మని నాతో చాలా సేపు మాట్లాడారు. పెళ్లి రిసెప్షన్‌కి తప్పకుండా రావాలి సర్ అని చెప్తే అలాగే అన్నారు. ఏదో బాగోదని అలా పైకి వస్తా అని చెప్పారులే అనుకున్నా కానీ ఆయన రిసెప్షన్ మొదలైన అరగంటకే వచ్చేసారు. ఆయన వస్తారని అస్సలు ఊహించలేదు. నాకు ఏం చెప్పాలో తెలీక భోజనం చేసి వెళ్లండి సర్ అని చెప్పారు. కానీ ఆయన స్టేజ్ మీదకి రాగానే మామూలు రచ్చలేదు. అలాంటిది ఇంక ఆయన భోజనం చేయడం అంటే అస్సలు కుదరనిపని. మళ్లీ ఎప్పుడైనా భోజనానికి వస్తానులే అని చెప్పారు. అన్నయ్య (చిరంజీవి) కూడా వస్తారు కాసేపట్లో అని చెప్పి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు వపన్ రాజకీయాల్లోకి వెళ్లారు కాబట్టి కచ్చితంగా ఆయనకు సీఎం అయ్యే సత్తా ఉందనే చెప్తాను” అని చెప్పుకొచ్చారు లయ.