ప్రీతి విషయంలో యాజమాన్యం సరిగా స్పందించాల్సింది – పవన్‌కల్యాణ్
తెలంగాణలో సంచలనం సృష్టించిన వైద్యురాలు ప్రీతి మృతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వరంగల్ ఎంజీఎంలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రీతి మృతి తనను కలచివేసిందని.. ఆమె మరణం అత్యంత బాధాకరమని పవన్ అన్నారు. డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన స్పందించారు.
వైద్య విద్యార్థిని మృతికి కారణమైన విషయాలను పవన్ ప్రస్తావించారు. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు వల్ల క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం తనను కలిచివేసిందన్నారు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రి వద్ద ప్రీతి కోసం ఎదురు చూస్తున్న ఆమె కన్నతల్లిదండ్రులను చూస్తుంటే… తన హృదయం ద్రవించిందని తెలిపారు. సైఫ్ వేధింపుల గురించి ప్రీతి చెప్పినప్పుడే.. కళాశాల యాజమాన్యం తక్షణమే స్పందించి సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. ఏది ఏమైనా ప్రీతి మరణం.. ఆమె తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిందన్నారు.
కన్నీటితో ప్రీతీకి గ్రామస్థుల వీడ్కోలు..
హైదరాబాద్ నిమ్స్‌లో సుమారు అయిదు రోజుల పాటు కొన ఊపిరితో చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి ప్రీతి మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో అక్కడే ఉన్న తల్లిదండ్రులు, సోదరి, ఇతర మిత్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తాము గిరిజనులం అనే ఎవరూ ప్రీతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదని.. మృతురాలి అక్క వాపోయింది. తన చెల్లిని అందరూ ఒంటరి చేసి వేధించారని ఆమె ఆరోపించింది. తన చెల్లి ఆత్మహత్యాయత్నం విచారణను పోలీసులు మధ్యలోనే ఆపేశారని.. ఎందుకు విచారణ ఆపేశారని ప్రశ్నించింది. తన చెల్లి మృతి కేసులో వాస్తవాలు ఏమున్నాయో నిగ్గు తేలాలని డిమాండ్ చేశారు.
మరోవైపు జనగాం జిల్లాలోని గిర్నితండాలో ప్రీతి మృతదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. మృతదేహాన్ని కడసారిగా చూసేందుకు పెద్దఎత్తున తండా వాసులు తరలి వచ్చారు. జోహార్ ప్రీతి అంటూ నినాదాలు చేశారు. ప్రీతి అంత్యక్రియలను వారి వ్యవసాయ భూమిలోనే నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజా సంఘాల నాయకులు గర్నితండాకు తరలివచ్చారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైటాయించి నినాదాలు చేయడంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది పోలీసులు జ్యోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపివేశారు. ఇక ఎన్నో ఆశలు, ఆశయాలతో వైద్య వృత్తిలోకి వచ్చిన ప్రీతి ఇలా అర్ధంతరంగామృతిచెందిన తీరు ఎంతో మందిని కలచివేసిందని చెప్పవచ్చు.