OTTలోకి పఠాన్​.. డిలీటెడ్ సీన్స్‌తో పాటు!

కరోనా లాక్​డౌన్​ కారణంగా అన్ని పరిశ్రమలతోపాటు సినీ పరిశ్రమ కూడా వెనకపడిపోయింది. అయితే టాలీవుడ్​ వరుస హిట్లతో కొంతవరకు కోలుకున్నా బాలీవుడ్​ సినిమాలు బాక్సాఫీస్​ వద్ద అంతగా సందడి చేయలేకపోయాయి. రెండేళ్లుగా సరైన హిట్టులేకుండా చతికిలపడ్డ బాలీవుడ్​కి షారుఖ్​ ఖాన్​ హీరోగా వచ్చిన ‘పఠాన్​’ ప్రాణం పోసిందనే చెప్పాలి. మధ్యలో ‘భూల్‌ భూలయా-2’, ‘దృశ్యం-2’ వంటి సినిమాలు కాస్త ఊరటనిచ్చినా సౌత్‌ సినిమాల డామినేషన్‌ ఎక్కువగా కనిపించింది. దక్షిణాది సినిమాల కలెక్షన్‌లు ముందు అవి తేలిపోయాయి. పైగా ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ సినిమాలు బైకాట్‌ బారిన పడటం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోడచ్చు. ఈ క్రమంలో అన్ని వివాదాలను ఎదుర్కొంటూ పఠాన్‌ జనవరి 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

విడుదలకు ముందు నుంచే పఠాన్​ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలీవుడ్​ దర్శకనిర్మాతలు ఎన్నో ఆశలు పెట్టుకుని విడుదల చేసిన ఈ సినిమా అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాబట్టింది. మొదటి రోజే కాకుండా వరుసగా ఆరు రోజులు వంద కోట్ల గ్రాస్‌కు దిగకుండా కలెక్షన్‌లు రాబడుతూ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌కు ఊపిరిపోసింది. షారుఖ్‌ఖాన్‌ యాక్షన్‌, దీపికా అందాలు, జాన్‌ అబ్రహం విలనిజం ప్రేక్షకులను థియేటర్‌లకు రిపీటెడ్‌గా వచ్చేలా చేశాయి. బాహుబలి-2 పేరిట ఉన్న రికార్డును సైతం బద్దలు కొట్టి.. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన సినిమాగా సంచలనం సృష్టించింది. ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమా మార్చి 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించగా, సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్‌ అబ్రహం కీలకపాత్రలో నటించాడు. ప్రపంచ వ్యాప్తంగా రూ.1044.50 కోట్ల గ్రాస్ కలెక్ట్‌ చేసి వెయ్యి కోట్ల మార్కు టచ్‌ చేసిన రెండో హిందీ సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పి షారుఖ్​ అసలైన బాలీవుడ్​ బాద్​షా అని మరోసారి నిరూపించింది పఠాన్​.