ఆ ఒక్క సీన్ పెట్టుంటే…. ‘వీర సింహారెడ్డి’పై పరుచూరి కామెంట్స్!
సినీ రచయితగా తెలుగువారికి బాగా పరిచయమున్న పేరు పరుచూరి గోపాలకృష్ణ. నటుడు, రచయితగా సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసిన పరుచూరి కొంత కాలంగా సినిమాలపై తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా పరుచూరి నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాపై తన అభిప్రాయం తెలిపారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన యాక్షన్, ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వీర సింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఓటీటీలోనూ రికార్డు వ్యూస్‌తో చరిత్ర సృష్టిస్తున్న ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా చూస్తుంటే ఎన్టీఆర్ నటించిన ‘చండశాసనుడు’గుర్తుకు వచ్చిందని ఆయన అన్నారు.
‘‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని చూశాను. బాలయ్య యాక్టింగ్ బాగా నచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని చూస్తున్నంతసేపు.. మేము రచయితలుగా వ్యవహరించిన ఎన్టీఆర్ ‘చండశాసనుడు’ సినిమా నాకు గుర్తుకు వచ్చింది. ఎందుకంటే, ఈ రెండు చిత్రాల్లోని కథాబీజం కాస్త ఒకేలా ఉంటుంది. ‘చండశాసనుడు’లో ప్రేమ వల్ల అన్నాచెల్లెళ్ల మధ్య వైరం.. అన్నయ్య నాశనమైపోవాలని చెల్లి కోరుకోవడం.. ఆయన ఇంటికే వెళ్లి శాపనార్థాలు పెట్టడం.. ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమాలోనూ అలాంటి సన్నివేశాలనే చూడొచ్చు. కాకపోతే, ఒకటే వ్యత్యాసం.. ‘చండశాసనుడు’లో చెల్లికి మంచి భర్త ఉంటాడు. ఈ సినిమాలో చెల్లి (వరలక్ష్మి).. అన్నయ్యపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం విలన్(దునియా విజయ్)నే పెళ్లి చేసుకుంటుంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపడేలా డైలాగ్స్ ఇందులో ఉన్నాయి. ఈ సినిమాని చూసినప్పుడు నాకు బోయపాటి శ్రీను సినిమా చూస్తున్న భావన కలిగింది. ఎందుకంటే బాలయ్య నటన, ఆయన డైలాగ్ డిక్షన్, హావభావాలు.. అన్నీ ‘సింహా’, ‘లెజెండ్’ల్లో చూసినట్టే ఉంది. ‘వీర సింహారెడ్డి’ ఫస్టాఫ్ బంగారం. కానీ, సెకండాఫ్ అంతగా లేదనేది నా అభిప్రాయం’’.
‘పులి గాండ్రింపు ఎప్పుడూ అలాగే ఉండాలి. అన్నాచెల్లెళ్ల అనుబంధం కాబట్టే ఈ సినిమా దాదాపు రూ.130 కోట్లు వసూళ్లు చేయగలిగింది. వీర సింహారెడ్డి పాత్ర చనిపోయాక ఆయన చేసిన త్యాగం ఏమిటనేది జై సింహారెడ్డికి తెలుస్తుంది. అది కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌కు అంత సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. నవీన్ చంద్రను చంపేసింది విలనేనని సినిమా చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది. ఒకవేళ, ఒకవేళ నవీన్ చంద్ర ఆత్మహత్య చేసుకున్నట్టే ఈ సినిమాలో చూపించి ఉంటే ఇది ఆడేది కాదు. ప్రాథమిక లోపం ఏమిటంటే.. వీరసింహారెడ్డి పాత్రను ముందే ముగించి ఆ తర్వాత ఫ్లాష్‌బ్యాక్ చెప్పడం. ‘వీర సింహారెడ్డి’ కొన ఊపిరిలో ఉండటం.. జైసింహారెడ్డి ఆయన్ని సొంతూరికి తీసుకురావడం.. ఆ సమయంలో తండ్రి గురించి ఫ్లాష్‌బ్యాక్ తెలుసుకుని ఉంటే ప్రేక్షకులకు సైతం అది వినాలనిపిస్తుంది. ఎప్పుడైతే ఆయన చనిపోయాడని ప్రేక్షకులకు తెలిసిందే.. అభిమానులకు ఒక నిరాశ వచ్చేస్తుంది. అలా కాకుండా ఫ్లాష్‌బ్యాక్ తెలుసుకున్న తర్వాత జై సింహారెడ్డి.. విలన్‌పై పోరాడి.. అత్తకు నిజం తెలిసేలా చేసి.. చివరికి తన తండ్రి, మేనత్తకు సమాధులు కట్టినట్టు లాస్ట్ షాట్‌లో చూపించి ఉంటే సినిమా మరోలా ఉండేదనేది నా భావన. అనవసరమైన నిడివి ఎక్కువగా పెట్టుకోకూడదు. అలాగే, తన తండ్రిని చంపిన వాళ్లల్లో హీరోయిన్ తండ్రి కూడా ఉన్నాడని.. చివర్లలో హీరో ఆయన్ని కూడా కొట్టినట్టు చూపించారు. ఆ తర్వాత ఆయన ఏం అయ్యాడు? హీరో – హీరోయిన్‌కు పెళ్లి జరిగిందా? బెంగళూరు నుంచి వచ్చిన వాళ్లందరూ ఏమయ్యారు? ఇలాంటి వాటిని చూపించకుండా సడెన్‌గా సినిమా ముగిసిపోయినట్టు ఉంది. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలన్నింటినీ జయించి ఈ సినిమా రూ.134 కోట్లు వసూళ్లు రాబట్టిందంటే దానికి ఒకే ఒక్క కారణం బాలయ్య మాత్రమే’ అని పరుచూరి వివరించారు.