బడికెళ్తున్న పిల్లలపై తల్లిదండ్రులు ఓ లుక్ వేయాల్సిందే!
రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. మామూలు రోజుల్లో పిల్లలు ఉదయం 8 గంటలకు బడికి వెళ్ళి సాయంత్రం నాలుగు తర్వాత ఇంటికి చేరేవారు. వారిని తల్లిదండ్రులు, సంరక్షకులు చూసుకునేవారు. పిల్లలను స్కూల్‌కి పంపించి ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతారు. వారే స్కూల్ నుండి ఇంటికి వచ్చి కొద్దిసేపు ఆటలాడుకునే లోపు తల్లిదండ్రులు ఇంటికి చేరేవారు. కానీ ఒంటిపూట బడులు దానికి వ్యతిరేకం మధ్యాహ్నం వరకే పాఠశాల కావడంతో గ్రామాల్లో ఉన్న పిల్లల్లో పాఠశాల నుంచి వచ్చిన అనంతరం తల్లిదండ్రులు లేకపోవడంతో వివిధ ఆటలు ఆడటం, స్నేహితులతో కలిసి చెట్లు, పుట్టలు, గట్లు తిరగడం అలాగే ఈత వచ్చినా రాకపోయినా స్నేహితులతో పాటు బావులకు వెళ్లడం అక్కడ సరదాగా ఆడుకుంటూనే ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి చనిపోయిన ఘటనలు అనేకం. ఇలాంటి విషాద ఘటనల్లో 5 నుంచి 15 ఏండ్ల లోపు పిల్లలు సరదాకు చేసిన తప్పిదాలకు తల్లిదండ్రులకు కడుపు శోకం తప్పడం లేదు.
అందుకే తల్లిదండ్రులు పిల్లలను ఈ ఒంటిపూట బడుల సమయంలో బాధ్యతగా కనిపెట్టాలి. వాళ్ళ కదలికలను గమనిస్తుండాలి. మంచి, చెడు, అపాయాల గురించి చెప్పాలి. వీలైతే ఆటలు ఆడించడం, ఈత నేర్పించడం వంటి వంటివి స్వయంగా సంబంధీకుల పర్యవేక్షణలో జరిగితే ఎలాంటి ప్రమాదాలకు తావుండదు. అందుకే తల్లిదండ్రులు బయట తిరిగే పిల్లల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వాళ్లను దారిలోకి తీసుకురావాలి. మానసిక స్థితికి అనుగుణంగా మాటలు, చేతల ద్వారా గాడిలో పెట్టాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలను ఒంటిపూట బడులప్పుడు, వేసవిలో, ఇతర సమయాల్లోనూ వివిధ అనర్ధాలు, ప్రమాదాలు, అపాయాల బారి నుంచి వారిని రక్షించుకోగలం.