Oscar:కుంభస్థలాన్ని బద్ధలు కొట్టిన RRR.. చిత్రబృందానికి ప్రశంసల వెల్లువ!
దేశమంతా ఆస్కార్ గురించే చర్చించుకుంటోంది. భారతీయ సినిమా అందులోనూ తెలుగు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కడం సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించిడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాయతీ వేదికపై తెలుగు పాటకు గౌవరం దక్కడం గర్వంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు అభినందనలు తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవడం అభినందనీయం అని ఆయన అన్నారు. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
తెలుగు సినిమాకు తొలి ఆస్కార్ అవార్డును అందించిన RRR చిత్ర యూనిట్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట..‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అందుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. తెలుగు వెండితెర ఇలాంటి మరిన్ని అద్భుతమైన చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆకాంక్షించారు. విశ్వ వేదికపై భారతీయ సినిమాకి దక్కిన మరో గొప్ప గౌరవం అన్నారు.
బెస్ట్ ఒరిజినల్ స్కోరు విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందానికి స్టార్ హీరో రజనీకాంత్ అభినందనలు తెలిపారు. కీరవాణి, రాజమౌళిలతో పాటు, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్రాన్ని తెరకెక్కించిన కార్తికి గోస్సెల్వెస్కు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఒక భారతీయుడిగా గర్వంతో సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.
‘నాటు నాటు’ ప్రపంచ ఖ్యాతి సొంతం చేసుకుంది!! ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సభ్యులందరికీ నా హృదయ పూర్వక అభినందనలు. ‘ఆస్కార్’ అనేది ఇప్పటివరకూ భారత్‌కు ఒక కలగా ఉండేది. కానీ, రాజమౌళి విజన్, ధైర్యం, నమ్మకం మనకు అవార్డు వచ్చేలా చేసింది. కోట్లాది భారతీయుల హృదయాలు గర్వం, సంతోషంతో నిండిన క్షణాలివి’అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, నాయకులు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పలువురు మంత్రులు సోషల్‌మీడియా వేదికగా చిత్ర యూనిట్‌ని ప్రశంసించారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, నేచురల్ స్టార్ నాని, మాస్‌మహరాజ రవితేజ, ఇతర హీరోలు, నిర్మాతలు, దర్శకులు, అభిమానులు.. ఒక్కరేమిటి యావత్ భారతమంతా సగర్వంగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతోంది.