Oscar: పాటని “నాటు”గా పరిచయం చేసిన దీపికా పదుకొణె!

95 ఆస్కార్​ అవార్డు వేడుకల్లో ‘నాటు నాటు’ ఓ ఊపు ఊపింది. భారత సినీ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ దేశప్రజల కలను సాకారం చేసింది. ఒరిజినల్​ సాంగ్​ కేటగిరీలో బరిలో దిగిన ఈ పాట ఆస్కార్​ని దక్కించుకుని తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసింది. అయితే ఈ పాట ఆస్కార్​ ప్రయాణం అత్యంత ఆసక్తికరంగా సాగింది. లాస్​ ఏంజిల్స్​లోని డాల్బీ థియేటర్​లో జరిగిన అకాడమీ వేడుకల్లో నాటునాటు కేకపెట్టించింది. అవార్డు ప్రకటించడానికి ముందే రాహుల్​ సిప్లిగంజ్​, కాలభైరవ ఈ పాటని లైవ్​లో ఆలపించగా అందుకు తగినట్టు వెస్ట్రన్​ డ్యాన్సర్స్ కాలు కలిపారు. ఈ ప్రదర్శనకు థియేటర్​లోని వారంతా లేచి నిల్చుని స్టాండింగ్​ ఒవెషన్​ ఇవ్వడం నిజంగా తెలుగువారికి గర్వకారణమనే చెప్పుకోవాలి. అయితే ఈ వేడుకల్లో మరింత ప్రత్యేకం ఏంటంటే.. నాటు నాటు పాటని బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ దీపికా పదుకొణె వేదికపై పరిచయం చేయడం.​

అకాడమీ వేడుకల్లో తుమ్మెదలా నల్లని డిజైనర్​ అవుట్​ఫిట్​లో మెరిసిన దీపికా నాటు నాటు పాటని పరిచయం చేస్తూ..‘తిరుగులేని గాయకులు.. ఉర్రూతలూగించే బీట్స్‌.. అదరహో అనిపించిన డ్యాన్స్​ ఈ పాటను ప్రపంచవ్యాప్తం చేశాయి. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ మధ్య స్నేహాన్ని చాటిచెప్పిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని కీలక సన్నివేశంలో వచ్చే పాట. యూట్యూబ్‌, టిక్‌టాక్‌లలో కోట్లాది వీక్షణలను సొంతం చేసుకోవడమే గాక.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో థియేటర్లలో ప్రేక్షకుల చేత స్టెప్పులు వేయించింది. అంతేనా.. భారత సినీ ఇండస్ట్రీ నుంచి ఆస్కార్‌కు నామినేట్‌ అయిన తొలి పాటగా ఘనత సాధించింది. ‘డు యూ నో నాటు?’ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం నుంచి ‘నాటు నాటు’ఇదే..’ అంటూ చక్కని పరిచయంతో ఆకట్టుకుంది. అది విని అక్కడున్నవారంతా చప్పట్లతో నాటు నాటు బృందానికి స్వాగతం పలికారు.

పరిచయ అనంతరం గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌ నాటు నాటు పాట పాడగా.. వెస్ట్రన్‌ డ్యాన్సర్లు అచ్చంగా ఎన్టీఆర్​, రామ్​ చరణ్​ను తలపించే డ్యాన్స్‌తో అలరించారు. ఈ పాట ప్రదర్శన సమయంలో ఆస్కార్‌ వేడుకకు వేదికైన డాల్బీ థియేటర్‌ మొత్తం కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. ప్రదర్శన పూర్తయిన తర్వాత వేదికలో పాల్గొన్నవారంతా లేచి నిల్చుని చప్పట్లతో అభినందించారు. ‘నాటు నాటు’ను పరిచయం చేసిన దీపిక వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆస్కార్​ గెలవడం, అందులోనూ అంతటి ఆదరణ లభించడం నిజంగా ప్రతి భారతీయుడు గర్వపడే క్షణాలివి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఆస్కార్​ వేడుకలో దీపిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ డిజైనర్‌ లూయిస్‌ విట్టన్‌ రూపొందించిన నలుపు రంగు క్లాసిక్‌ గౌను ధరించిన దీపిక.. మెడలో కార్టియర్‌ నెక్‌పీస్‌లో హుందాగా కన్పించారు. నల్లని అవుట్​ఫిట్​తో ఉన్న ఫొటోలను దీపిక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా క్వీన్‌ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. బాలీవుడ్​ ఫైర్​ బ్రాండ్​ కంగనా రనౌత్​ కూడా దీపికాను మెచ్చుకుంటూ సోషల్​మీడియాలో పోస్ట్​ చేయడం విశేషం.