Oscar: సాధించేసాం.. ఆస్కార్ అందుకున్న ‘నాటు నాటు’
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ప్రతిష్టాత్మక 95వ అకాడమీ వేడుకల్లో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ ఆస్కార్ దక్కించుకుంది. RRR తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పింది. ప్రపంచ వేదికపై తెలుగు భాషకి పట్టాభిషేకం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 81 పాటలు ఆస్కార్‌కు ఎంట్రీ ఇవ్వగా.. తుది జాబితాలో ఐదు పాటలు ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయ్యాయి. నాటు నాటు తో పాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హ్యాండ్ (టాప్‌గన్:మావెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), దిస్ ఈజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు ఆస్కార్ కోసం పోటీ పడగా.. నాటు నాటు పాట ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించింది.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో పాన్ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచీ రికార్డులు సృష్టిస్తూనే ఉంది. వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అవార్డులను సొంతం చేసుకుంటూ తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది.
ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకున్న నాటు నాటు పాటకు ఇప్పుడు ఆస్కార్ రావడంతో భారతీయ సినీ ప్రేక్షకుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. ఇటీవలే ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును నాటు నాటు పాట గెలుచుకుంది. ఆ అవార్డు గెలుచుకున్న తొలి ఆసియా పాట కూడా ఇదే. రిహాన్నా పాడిన లిఫ్ట్ మి అప్, టేలర్ స్వీఫ్ట్ పాడిన కరోలినా, లేడీ గాగా పాడిన హోల్డ్ మై హ్యాండ్ పాటలను వెనక్కి నెట్టి.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకుంది.
అంతేకాదు, ప్రతిష్ఠాత్మకమైన ఇంటర్నేషనల్ అవార్డు క్రిటిక్స్ చాయిస్ అవార్డును కూడా నాటు నాటు దక్కించుకుంది. ఇందులో బెస్ట్ సాంగ్ అవార్డును నాటు నాటు సొంతం చేసుకోగా, ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఉత్తమ పాట విభాగంలో హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డును నాటు నాటు సొంతం చేసుకున్నది. బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా హెచ్‌సీఏ అవార్డులు దక్కించుకున్నది. బెస్ట్ సాంగ్ విభాగంలో హ్యూస్టన్ ఫిల్మ్ క్రికెట్ సొసైటీ అవార్డును కూడా నాటు నాటు కైవసం చేసుకున్నది. అదేవిధంగా ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆన్లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డును సైతం ఈ పాట సొంతం చేసుకుంది. ఎమ్.ఎమ్ కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్ ఆలపించారు. ఆస్కార్ వేదికపైనా ఈ ఇద్దరు గాయకులు లైవ్‌లో నాటు నాటు పాటపాడి ప్రపంచాన్ని ఊర్రూతలూగించారు. ఇంతకుముందు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలోని ‘జయహో’ పాటకు ఆస్కార్ రాగా, దీనిని హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించారు. అచ్చంగా భారతదేశ సినిమాకి ఆస్కార్ రావడం ఇదే మొదటిసారి.